UP Elections 2022: ఎన్నికల సంఘం ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూలును ప్రకటించేంతవరకు.. యోగి ఆదిత్యనాథ్‌పై బ్రాహ్మణుల ఆగ్రహం భారతీయ జనతా పార్టీ విజయావకాశాలను దెబ్బతీయొచ్చని చాలామంది భావించారు. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే యోగి ప్రభుత్వం నుంచి ముగ్గురు ఓబీసీ మంత్రులు వైదొలగడంతో భాజపాకు తీరని నష్టం ఖాయమనే అభిప్రాయం బలపడుతోంది. యూపీలో దళితులు, వెనుకబడిన కులాలు, నిరుద్యోగ యువత, రైతులు, చిన్న, మధ్యతరహా వ్యాపారులను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్, ధరమ్‌సింగ్ మంత్రి పదవులకు రాజీనామా చేసి ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరిపోయారు. వారి రాజీనామా లేఖలు ఒకే విధంగా ఉన్నాయని ట్విటర్‌లో చాలామంది వ్యాఖ్యానించారు. 1990లలో మండల్ కమిషన్ నివేదికను అమలు చేసినప్పటి నుంచి సామాజిక న్యాయమనే పదబంధం యూపీ, బిహార్‌లలో బహుళ ప్రాచుర్యం పొందింది. సమాజ్‌వాదీ పార్టీ సంస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ బలీయ నాయకుడిగా ఆవిర్భవించారు. ఇతర వెనుకబడిన కులాలు (ఓబీసీ), ముస్లింలను కూడగట్టి ఎస్పీ అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ బలం హరించుకుపోయి ములాయం, బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకురాలు మాయావతి అధికార కేంద్రాలుగా ఎదిగారు.
గతంలో భాజపాకు అచ్చొచ్చిన ఫార్ములా
Caste Politics In UP: తరవాత చాలా ఏళ్లకు మోదీ నాయకత్వంలో భాజపా యూపీలో యాదవేతర ఓబీసీలను, జాతవేతర దళితులనూ తనవైపు తిప్పుకొని 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా ఆ పార్టీకి అచ్చొచ్చింది. యూపీలో ఓబీసీ ఓటర్లు 35-37 శాతం ఉంటారు. వారిలో యాదవుల వాటా 10-12 శాతం. వీరు సమాజ్‌వాదీ పార్టీ విధేయులు కాగా, మిగిలిన 25 శాతం ఓబీసీలను భాజపా కూడగట్టుకుని 2014 (లోక్‌సభ), 2017 (అసెంబ్లీ), 2019 (లోక్‌సభ) ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ నాయకత్వంలోని ఎస్పీ 66 శాతం యాదవ ఓట్లను తన ఖాతాలో వేసుకోగా, ఇతర వెనుకబడిన కులాల ఓట్లలో 60 శాతాన్ని భాజపా చేజిక్కించుకుంది.
అఖిలేశ్ వ్యూహం ఫలిస్తుందా?
UP Elections 2022: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను 80 శాతం హిందువులకూ, 20 శాతం ముస్లింలకూ మధ్య పోటీగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించడాన్ని అఖిలేశ్ తనకు అనువుగా మార్చుకోవాలనుకుంటున్నారు. యాదవ, ముస్లిం ఓట్లకు తోడు ఓబీసీ ఓటర్లనూ ఆకట్టుకోవడానికి భాజపా నుంచి ఓబీసీ మంత్రులను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కానీ, ఆ మంత్రులు యాదవేతర బీసీలను ఏ మేరకు ఎస్పీ వైపు ఆకర్షిస్తారన్నది కీలక ప్రశ్న. ఆ సత్తా తనకుందని స్వామి ప్రసాద్ మౌర్య అంటున్నారు. మౌర్యకు తూర్పు యూపీలో ప్రాబల్యం ఉంది. దీనికి ప్రతిగా భాజపా అఖిలేశ్ బంధువైన ఎస్పీ ఎమ్మెల్యే హరి ఓం యాదవ్‌ను తనతో చేర్చుకుంది. కాంగ్రెస్ నుంచి మరో ప్రముఖ ఓబీసీ నేత నరేశ్ సైనీనీ కలుపుకొంది. మొత్తంమీద ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు ఓబీసీలు కీలకం కానున్నారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ బాటలోనే భాజపా.. ఎన్నికల వాయిదా తప్పదా?