UP election 2022: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో 10 రోజుల్లో జరగనుంది. ఈ క్రమంలో ఓటింగ్ శాతం పెంచేందుకు లఖ్‌నవూలోని ప్రైవేటు పాఠశాలలు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాయి. తల్లిదండ్రుల ఓటు పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వటమే కాదు.. పాఠశాలలో నిర్వహించే పరీక్షల్లో అదనపు మార్కులనూ అందిస్తుందని అంటున్నాయి. తల్లిదండ్రలు ఓటు వేస్తే వారి పిల్లలకు పరీక్షల్లో అదనంగా మార్కులు కలుపుతామని ప్రకటించాయి. ఇందుకోసం అసెంబ్లీ ఎన్నికల్లో తల్లిదండ్రులు ఓటు వేసి.. మరుసటి రోజున పాఠశాలకు వచ్చి సిరా గుర్తును చూపించాలని సూచించాయి. అలా చేసిన వారి పిల్లలకు పరీక్షల్లో 10 మార్కులు అదనంగా కలుపుతామని తెలిపాయి.
ఈ ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా పాలనావిభాగం భాగస్వామ్యంతో చేపట్టాయి అన్ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలు. ఈ ప్రయత్నం ద్వారా లఖ్‌నవూతో పాటు ఇతర నగరాల్లోనూ ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ అగర్వాల్. లఖ్‌నవూ జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఫిబ్రవరి 23న నాలుగో దశలో ఓటింగ్ జరగనుంది.
లఖ్‌నవూ జిల్లాలో మొత్తం 1040 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయగలిగితే మరింత ప్రయోజనం కలుగుతుందని చెప్పారు అనిల్. 2017 ఎన్నికల్లోనూ లఖ్‌నవూలోని ప్రైవేటు పాఠశాలలు ఇలాంటి కార్యక్రమమే చేపట్టినట్లు గుర్తు చేశారు.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో లఖ్‌నవూలో 66.82 శాతం ఓటింగ్ నమోదైంది. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ప్రజలు ఓటు వేసేందుకు తక్కువగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ 65 శాతానికిపైగా నమోదైంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు లఖ్‌నవూలోని 9 నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య 38,04,114గా ఉంది. అందులో పురుషులు 29,26,589, మహిళలు, 17,77,319గా ఉన్నారు. 206 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: ఎక్కడికెళ్లినా అఖిలేశ్ వెంటే ఆ మూట.. ఇంతకీ అందులో ఏముంది?