Akhilesh Yadav Phone Tapping: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం సమీపిస్తుండగా అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఆదివారం ఆరోపించారు. ప్రతి సాయంత్రం తన కాల్స్‌ను ఆయన వింటున్నారని చెప్పారు.
Akhilesh On Cm Yogi: యోగి ఆదిత్యానాథ్‌ను 'యోగి+యూపీ= ఉపయోగి' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించడాన్ని అఖిలేశ్ ఎద్దేవా చేస్తూ.. 'యోగి నిరుపయోగి' అని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతో భాజపా ప్రభుత్వం వివిధ దర్యాప్తు సంస్థలను తనకు అనుకూలంగా వాడుకుంటోందని ఆరోపించారు. కొందరు ఎస్పీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ శనివారం దాడులు నిర్వహించిన నేపథ్యంలో అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"మా ఫోన్ సంభాషణలన్నీ వింటున్నారు. ప్రతి సాయంత్రం ఈ 'నిరుపయోగి' ముఖ్యమంత్రి కొందరి ఫోన్ రికార్డింగులను వింటున్నారు. నాతో మాట్లాడే విలేకరులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల్లో ఓడిపోతామని భాజపాకు తెలిస్తే.. వివిధ ఏజెన్సీలను తమకు అనుకూలంగా వాడుకుంటుందన్న విషయం దేశ ప్రజలందరికీ తెలుసు.
-అఖిలేఖ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత
Akhilesh Yadav Central Agencies: "భాజపా కూడా కాంగ్రెస్ దారిలోనే వెళ్తోంది. తమ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేసేందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించుకునేది. ఇప్పుడు ఆ పని భాజపా చేస్తోంది. రాష్ట్రంలో పరిస్థితి చూస్తోంటే.. యోగి ప్రభుత్వం ఇక ఏమాత్రం కొనసాగదని నేను చెప్పగలను. ప్రజలు యోగ్యమైన ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు" అని అఖిలేఖ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: యూపీలో మోదీ సుడిగాలి పర్యటనలు- 10 రోజుల్లో నాలుగు టూర్లు!
ఇదీ చూడండి: Modi: 'వెళ్లండయ్యా.. వెళ్లి కాశీ చూసి రండి.. ఎంతో అభివృద్ధి చేశాం'