ప్రపంచ ప్రఖ్యాత ప్రేమసౌధం తాజ్‌మహల్ వద్ద శుక్రవారం ఓ అనుమానాస్పద డబ్బా కలకలం రేపింది. పేలుడు పదార్థాలు ఉన్నాయనే అనుమానాలతో భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారు. చివరకు అందులో ఆహార పదార్థాలు మాత్రమే ఉన్నాయని తెలుసుకుని అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ జరిగింది..
ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రా పురానీ మండీ ప్రాంతంలోని షాజహాన్ గార్డెన్ సమీపంలో ఓ చిన్న క్యాన్‌కు తాళం వేసి ఉన్నట్లు ఓ స్థానికుడు గమనించాడు. వెంటనే తాజ్‌గంజ్ పోలీసులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం అందించారు.
ప్రత్యేక కిట్ ధరించి, అత్యంత జాగ్రత్తగా క్యాన్ తెరిచింది బాంబ్ నిర్వీర్య దళం. చివరకు.. క్యాన్‌లో పేలుడు పదార్థాలు లేవని, కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని తేల్చింది.
పేలుడు పదార్థాలున్నాయనే అనుమానాల నేపథ్యంలో గంటన్నర పాటు స్థానికుల్లో భయాందోళన నెలకొంది. బాంబ్ స్క్వాడ్.. క్యాన్‌ను తొలగించే సమయంలో ఆ మార్గం వైపు వెళ్లకుండా పోలీసులు వాహనాలను నిలిపివేశారు.
ఇదీ చదవండి:గంగా జలంతో కేసుల పరిష్కారం- పోలీసులపై చర్యలు