Tablet Wedding Card: వివాహ వేడుకల్లో.. శుభలేఖ ప్రాముఖ్యం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివిధ రూపాల్లో అందంగా అచ్చువేయించి మరీ శుభలేఖలు పంచుతుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది పెళ్లి కార్డుల విషయంలో వెరైటీగా ఆలోచిస్తున్నారు. ఏదైనా కొత్తగా చేయాలని తహతహలాడుతున్నారు. అలానే భావించిన తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి.. తన పెళ్లి కార్డు చూసి అందరూ అవాక్కయ్యేలా ప్రచురించాడు. టాబ్లెట్ షీట్ రూపంలో పెళ్లి కార్డును అచ్చు వేయించి అందర్నీ ఆశ్యర్యపరిచాడు.
Unique Marriage Invitation: తిరువణ్నామలై జిల్లాకు చెందిన డాక్టర్ ఎళిలరసన్.. విల్లుపురం జిల్లాకు చెందిన వసంతకుమారి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు. వీరిద్దరి వివాహానికి సెప్టెంబరు 5న వివాహ ముహుర్తాన్ని ఖరారు చేశారు పెద్దలు. వధూవరులిద్దరూ వైద్య రంగానికి చెందిన వారు కావడం వల్ల కాస్త వెరైటీగా టాబ్లెట్ షీట్ రూపంలో పెళ్లి కార్డులను తయారు చేయించి అతిథులను ఆహ్వానించాడు. అయితే ఈ వెడ్డింగ్ కార్డు చిన్నదే అయినా దానిపై అన్ని వివరాలు ఉండేలా చూసుకున్నాడు వరుడు ఎళిలరసన్.
సాధారణంగా టాబ్లెట్ షీట్‌పై ఎక్స్పైర్ తేదీ ఉన్న చోట పెళ్లి తేదీ, విందు సమయం, రిసెప్షన్ డేట్‌ను పొందుపరిచాడు. వధూవరుల విద్యార్హతలతో పాటు అన్ని రకాల వివరాలను కార్డుపై ముద్రించి పంచాడు. అంతే కాకుండా తన వివాహం రోజునే ఉన్న ప్రముఖ అకేషన్లను కూడా వరుడు పేర్కొన్నాడు. స్పెషల్ డేస్ అంటూ టీచర్స్ డే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు, మదర్ థెరిస్సా మెమోరియల్ డే అని కార్డుపై ప్రచురించాడు. అలాగే మ్యానుఫ్యాక్చర్బై దగ్గర ఆ శుభలేఖ ఎక్కడ ప్రింట్ అయిందో ఆ ప్రెస్ అడ్రస్‌ను కూడా చేయించాడు. ఇప్పుడు ఈ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టాబ్లెట్ షీట్ వెడ్డింగ్ కార్డును చూసిన నెటిజన్లు.. సూపర్, వెరైటీ థింకింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి: స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఫ్రీ, ఆ రాష్ట్రంలో కొత్త స్కీం