Unique Temple In Uttarakhand : సాధారణంగా భగవంతుడికి కొబ్బరికాయలు కొట్టి, పూలు, పండ్లు సమర్పించి, ఇతర కానుకలు ఇచ్చి.. కోరికలు కోరుకుంటారు భక్తులు. కానీ ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ జిల్లాలోని ఓ ఆలయంలో మాత్రం వినూత్నంగా దేవుడ్ని కొలుస్తున్నారు. గుడి ముందున్న చెట్టుకు కొడవళ్లు గుచ్చి.. కోరికలు కోరుతున్నారు.
జిల్లాలోని ఫతేపుర్ గ్రామం పరిధిలో అడవుల్లోని కొండల మధ్య ఈ గుడిని నిర్మించారు. దారతి దేవాలయంగా పేరొందిన ఈ గుడిలో గోపాల్ బిష్త్ విగ్రహాన్ని ప్రతిష్టంచారు. ఈ ఆలయాన్ని 40 ఏళ్ల క్రితం నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చి కొడవళ్లను చెట్టుకు గుచ్చి.. గోపాల్ బిష్త్‌ను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
"గుడికి కుడి వైపున కరణు చెట్టు ఉంది. గుడికి వచ్చే భక్తులు.. ఓ కొడవలికి తిలకం దిద్ది.. దాన్ని ఆ చెట్టుకు గుచ్చుతారు. దీంతో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని వారు నమ్ముతారు. గత 40 ఏళ్ల పాటు ఆ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అయితే ఎన్ని కొడవళ్లు గుచ్చినప్పుటికీ ఈ చెట్టు ఏ మాత్రం ఎండిపోదు. ఆ వృక్షానికి ఎటువంటి హాని జరగదు" అని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోని ఎవరి పశువులైనా అనారోగ్యానికి గురైనప్పుడు.. ఆవులు, గేదెలు పాలు ఇవ్వలేకపోయినప్పుడు.. గోపాల్ బిష్త్ దేవుడి విభూతిని వాటికి రాస్తామని వారు చెబుతున్నారు. దీంతో అవి అనారోగ్యం నుంచి కోలుకుంటాయని అంటున్నారు.
అడవిలో మధ్యలో ఉన్న ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణులు, క్రూర మృగాలు తిరుగుతుంటాయని అక్కడి వారు చెబుతున్నారు. గుడికి వెళ్లే సమయంలో అవి భక్తులకు ఎటువంటి హాని తలపెట్టవని పేర్కొంటున్నారు. పంటలకు కూడా నష్టాన్ని కలిగించవని వెల్లడిస్తున్నారు. ఇదంతా గోపాల్ బిష్త్ దీవెనల వల్లేనని వారు నమ్ముతున్నారు. శరద్ పూర్ణిమ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు స్థానిక ప్రజా ప్రతినిధి నీరజ్ తివారీ తెలిపారు. శరద్ పూర్ణిమ రోజున భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వస్తారని ఆయన వెల్లడించారు. భజనలు, అన్నదానం ఇతర కార్యక్రమాలు వంటివి నిర్వహించినట్లు పేర్కొన్నారు.
దేవుడికి నైవేద్యంగా సిగరెట్లు.. 'భూత్‌మామ' గుడిలో విచిత్ర పూజలు!