NEET exam postpone: నీట్ PG ప్రవేశపరీక్షలను వాయిదా వేయాలని జాతీయ పరీక్షల బోర్డుకు కేంద్రం సూచించింది. 6 నుంచి 8 వారాలు ఆలస్యంగా నిర్వహించాలని కోరింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 12వ తేదీ నుంచి నీట్ PG పరీక్షలు జరగాలి. అయితే నీట్-2021 కౌన్సిలింగ్ కూడా ఇదే సమయంలో ఉన్నందున అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షను వాయిదా వేయాలని కేంద్రం భావిస్తోంది.
అయితే పరీక్షలను వాయిదా వేసేలా నిర్వహణ బోర్డును ఆదేశించాలని ఆరుగురు MBBS విద్యార్థులు దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్న్‌షిప్ కాలం పూర్తయే వరకు నీట్ PG పరీక్షను వాయిదా వేయాలని పిటిషనర్లు అభ్యర్థించారు.
నీట్-2021 కౌన్సిలింగ్ కూడా ఇదే సమయంలో ఉన్నందున నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని ఎంతో మంది వైద్యులు కోరుతున్నారని, ఈ విషయాన్ని పరీక్షల బోర్డు దృష్టికి తీసుకెళ్లామని అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్(వైద్యవిద్య), మెడికల్ కౌన్సిలింగ్ మెంబర్ సెక్రటరీ డా.బీ. శ్రీనివాస్ చెప్పారు. మే, జూన్లో నిర్వహిస్తే ఎక్కువ మంది ఇంటర్న్‌షిప్ చేసేవారు కూడా హాజరవుతున్నారని పేర్కొన్నారు. అందుకే పరీక్షను వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుందని పరీక్షల బోర్డుకు చెప్పినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: నకిలీ విటమిన్-డీ ట్యాబ్లెట్ల విక్రయం.. ప్రముఖ ఫార్మా సంస్థ సీజ్!