కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 200 అడుగుల మొబైల్ టవర్ ఎక్కి.. 135 రోజులుగా నిరసన తెలుపుతున్న సురీందర్ గురుదాస్‌పూర్ ఎట్టకేలకు తన ఆందళనను విరమించారు. టవర్ నుంచి కిందకు దిగారు. ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్-టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఈటీటీ-టీఈటీ) ఉత్తీర్ణులైన నిరుద్యోగుల్లో ఒకరైన సురీందర్.. రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న 6,635 ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాజాగా ఆయన డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది.
అయితే మొబైల్ టవర్ నుంచి ఆయనను కిందకు దించే సమయానికి అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. చివరకు కాళ్ల మీద కూడా నిలబడలేని పరిస్థితితుల్లో ఉండడం చూసిన అధికారులు.. వైద్యులను ఘటనా స్థలికి రప్పిచారు. వైద్యపరీక్షల అనంతరం ఆయన్ను స్థానికంగా ఉండే రజీంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు.
"మా ఉపాధి కోసం చాలా కాలంగా పోరాటం చేశాం. ఈ క్రమంలో పోలీసులు చేతల్లో లాఠీచార్జీలు భరించాల్సి వచ్చింది. కాలువల్లో దూకి, మొబైల్ టవర్ల ఎక్కి మా హక్కుల కోసం పోరాటం చేశాం."
-సురీందర్ గురుదాస్‌పూర్
డిమాండ్లకు తలొగ్గిన ప్రభుత్వం..
పంజాబ్ ప్రభుత్వం 6,635 ప్రాథమిక ఉపాధ్యాయుల నియామకాల కోసం ప్రకటనలు జారీ చేసింది. వారి డిమాండ్లను అంగీకారం తెలిపింది. చివరాఖరుకు వారి డిమాండ్లకు తలొగ్గింది.
ఇదీ చూడండి: దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌పై దాడి