ముఖ్యమంత్రి యడియూరప్ప కర్ణాటక కేబినెట్‌ను విస్తరించారు. మరో ఏడుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ వాజూభాయీ వాలా వీరితో ప్రమాణస్వీకారం చేయించారు.
ఎమ్మెల్యేలు అర్వింద్ లింబావళ్లి, ఉమేశ్ కత్తి, అంగరా, మురుగేశ్ నీరాని.. ఎమ్మెల్సీలు సీపీ యోగేశ్వర్, ఎంటీబీ నాగరాజ్, ఆర్ శంకర్ యడ్డీ కేబినెట్లో చేరారు. 2019 జులైలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ మంత్రివర్గం విస్తరించడం ఇది మూడోసారి.
భాజపాలో అసంతృప్తి..
అయితే.. మంత్రివర్గ విస్తరణ రాష్ట్ర భాజపాలో అసంతృప్తి రాజేసింది. సీనియార్టీని పట్టించుకోలేదని పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. యడియూరప్ప.. కర్ణాటకలో భాజపాను హైజాక్ చేశారని, ఆయన కుటుంబ వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజయపుర సిటీ ఎమ్మెల్యే బసన గౌడ విజ్ఞప్తి చేశారు.
కేబినెట్ కూర్పుపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేత అమిత్ షాతో ఆదివారం చర్చించారు యడియూరప్ప. అనంతరం ఏడుగురికి అవకాశం ఇవ్వబోతున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు.
ఇదీ చూడండి: ఉత్తర దిల్లీలో పౌల్ట్రీ అమ్మకాలపై నిషేధం