Ukraine medical students Supreme court : యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు చదువు కొనసాగించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు. అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్ కింద వారు ఇతర దేశాల కళాశాలల్లో చేరే అవకాశం కల్పించాలని సిఫార్సు చేసింది. 20వేల మంది విద్యార్థులు దేశంలో చదువు కొనసాగించే వీలు లేనందున.. వారి విద్యాభ్యాసానికి సంబంధించి కేంద్రమే అన్ని చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది.
Ukraine medical student future : ఎంబీబీఎస్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లిన వేల మంది భారతీయ విద్యార్థులు.. రష్యాతో యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగొచ్చారు. వారిలో కొందరు.. తాము భారతీయ వైద్య కళాశాలల్లో చేరేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయస్థానం విచారణ జరుపుతుండగా.. గురువారం కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. విదేశాల నుంచి తిరిగివచ్చిన విద్యార్థుల్ని భారతీయ కళాశాలల్లో చేర్చుకునే ఆస్కారమే లేదని తేల్చిచెప్పింది. దీనిపై విద్యార్థుల తరఫు న్యాయవాదులు శుక్రవారం వాదనలు వినిపించారు. విద్యా సంవత్సరం కోల్పోకుండా.. కేంద్రమే సంబంధిత దేశాలతో చర్చించి, తగిన చర్యలు చేపట్టేలా చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి కీలక సూచనలు చేసింది సుప్రీంకోర్టు.
ఉక్రెయిన్ భాష, సిలబస్‌కు సరిపోయేలా.. 20 వేల మంది విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది. విద్యార్ధులు చుట్టుపక్కల దేశాలకు వెళ్లి కళాశాలలు వెతుక్కోవాల్సిన పరిస్థితి రాకుండా.. కేంద్రం చర్యలు తీసుకుంటే మంచిదని అభిప్రాయపడింది. వారి కోర్సును అభ్యసించగలిగేలా.. పారదర్శకతతో వివరాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉందని న్యాయస్థానం గుర్తు చేసింది. ఇందుకోసం కళాశాల ఫీజులు, అందుబాటులో ఉన్న సీట్లు వంటి వివరాలతో ఒక పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని సూచించింది. విద్యార్థులు కావాల్సిన కళాశాలను ఎంచుకునేలా బదిలీ ఆప్షన్ ఇవ్వాలని నిర్దేశించింది. ఇందుకు అనుగుణంగా తగిన కార్యాచరణ ప్రణాళికతో వస్తారని ఆశిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
మరోవైపు.. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థుల్ని యుద్ధ బాధితులుగా ప్రకటించాలన్న న్యాయవాదుల అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అది సైనికపరమైన అంశాల్లోనే సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.