Uday Kumar Remand Extended: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్‌ను పొడిగించారు. ఉదయ్ కుమార్ రిమాండ్‌ను మే 10 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ పొడిగించడంతో ఉదయ్‌ను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నెల 14న కడప జిల్లా పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు సీఆర్‌పీసీ 161 కింద నోటీసులు ఇచ్చి ఉదయ్ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సీబీఐ.. తండ్రి జయప్రకాశ్‌రెడ్డి, న్యాయవాది సమక్షంలోనే అరెస్టు చేశారు. ఉదయ్ అరెస్టు మెమోనూ అతని కుటుంబ సభ్యులకు అప్పగించిన అనంతరం అరెస్టు చేసింది. ఆ తర్వాత కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ఉదయ్‌ను తరలించారు.
అనంతరం కోర్టులో హాజరుపరిచిన ఉదయ్ కుమార్ రెడ్డికి 14రోజుల పాటు రిమాండ్ విధిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే వివేకా హత్య కేసులో కీలక విషయాలను రాబట్టేందుకు ఉదయ కుమార్‌రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆరు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఈ నెల 18న అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 19 బుధవారం నుంచి ఆరు రోజుల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆరు రోజుల పాటు విచారించింది.
వివేకా హత్య గురించి ఎవరికి తెలియకముందే మీకు ఎలా తెలిసింది: ఈ ఆరు రోజుల కస్టడీలో వివేకా హత్యకు సంబంధించి కీలక సమచారాన్ని ఉదయ్ నుంచి అధికారులు రాబట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే హత్య జరిగిన తర్వాత తెల్లవారుజామునే ఉదయ్‌కుమార్‌రెడ్డి ఇంటి నుంచి బయటకు రావడంపై సీబీఐ ప్రశ్నించింది. తెల్లవారుజామున 3 గంటల35 నిమిషాలకే బయటకొచ్చి, 4గంటల ఒక నిమిషం వరకు పులివెందులలో తచ్చాడినట్లు సీబీఐకి శాస్త్రీయ ఆధారాలు లభించాయి. వివేకా మరణించారంటూ అదే సమయంలో తల్లికి ఉదయ్‌కుమార్‌రెడ్డి చెప్పారనేది సీబీఐ అభియోగం. హత్యలో పాల్గొన్నట్లు చెబుతున్న నలుగురితో పాటు ఘటనాస్థలిలో వారిని చూసిన వాచ్‌మన్ రంగయ్యకు తప్ప వివేకా మరణం గురించి బయటి ప్రపంచానికి తెలియని ఆ సమయంలో మీకెలా తెలిసిందని ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.
ఇవీ చదవండి: