కేరళలోని కన్నూరు జిల్లాలో విషాదం నెలకొంది. కారులో ఒక్కసారి మంటలు చెలరేగడం వల్ల ఎనిమిది నెలల గర్భిణీతోపాటు ఆమె భర్త సజీవ దహనమయ్యారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులను ప్రిజిత్, అతడి భార్య రీషాగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కుత్తియాత్తూరుకు చెందిన ప్రిజిత్ భార్య రీషా ఎనిమిది నెలల గర్భిణీ. ఆమెకు గురువారం తెల్లవారుజామున పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆమెను తీసుకుని కుటుంబసభ్యులు కారులో ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెనుక సీటులో కూర్చున్న నలుగురు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను ఆర్పి.. ప్రిజిత్, రీషాను బయటకు తీశారు. కానీ అప్పటికే వారిద్దరూ మృతి చెందారు. శవపరీక్షల నిమిత్తం వారి మృతదేహాలను పోలీసులు.. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిపుణుల సహాయంతో కారును పక్కాగా పరిశీలిస్తామని.. అప్పుడే ఘటనకు గల అసలు కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనంతా స్థానికంగా ఉన్న సీసీటీవీల్లో రికార్డైనట్లు చెప్పారు.
గూగుల్ మ్యాప్స్‌లో రోడ్డు వెతుక్కుంటూ..
మహారాష్ట్రలోని పుణెలో దారుణం జరిగింది. గూగుల్ మ్యాప్స్‌లో రోడ్డు వెతుక్కునే ప్రయత్నంలో బైక్‌పై వెనుక కూర్చున్న ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని రిదా ఇంతియాజ్‌గా పోలీసులు గుర్తించారు. ముంబయి-బెంగళూరు హైవేపై జనవరి 28న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఖరాడీ ప్రాంతంలో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న నటరాజ్, రిదా అనే ఇద్దరు ఇంజినీర్లు బైక్‌రైడ్‌కు వెళ్లారు. ఆ సమయంలో వాన్వాడి ప్రాంతానికి వెళ్లాలనుకుని గూగుల్ మ్యాప్స్ సహాయం తీసుకున్నారు. అలా ముంబయి- బెంగళూరు హైవే మీదకు వచ్చారు. ఆ సమయంలో తాము దారి తప్పినట్లు నటరాజ్ గ్రహించాడు.
వెంటనే మలుపు తీసుకుంటుండగా.. వేగంగా వచ్చిన లారీ నటరాజ్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రిదా తలకు బలమైన గాయం కావడం వల్ల అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ప్రమాదం జరిగిన తర్వాత లారీని ఆపకుండా.. డ్రైవర్ వెళ్లిపోయాడు. ఘటన అనంతరం నటరాజ్.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.