Two Friends Begging For Stray Dogs And Cats : వీధుల్లో తిరిగే కుక్కలు, పిల్లుల బాగోగుల కోసం రోడ్డెక్కారు బంగాల్ కోల్‌కతాకు చెందిన ఇద్దరు స్నేహితులు. వాటి తిండి, ఆరోగ్యం సహా ఇతర అవసరాలు తీరేందుకు కావాల్సిన డబ్బు కోసం యాచిస్తున్నారు. అలా వచ్చిన సాయాన్ని వాటి యోగక్షేమాల కోసం వినియోగిస్తున్నారు.
మధురీతు దే, అనురభ్ రాయ్- ఇద్దరు స్నేహితులు. అనురభ్ రాయ్ డిగ్రీ పూర్తి చేసి పలు ఐటీ కంపెనీల్లో పనిచేసి మానేశారు. మధురీతు దే కూడా కోల్‌కతాలోని ఒక ప్రముఖ పబ్లిషింగ్ హౌస్‌లో 6 సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించి ఉద్యోగాన్ని వదిలేశారు. వీరిద్దరికీ టూరిజం రంగం అంటే ఎంతో ఇష్టం. ఇందులో భాగంగానే కొన్నాళ్ల తర్వాత ఇద్దరు కలిసి ఓ ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి దానిని నిర్వహిస్తున్నారు. అలా పర్యాటకంపై ప్రేమతో అప్పుడప్పుడు అడవుల్లో, కొండ మార్గాల్లో బైక్ రైడ్లకూ వెళ్తుంటారు.
ప్లకార్డు, డొనేషన్ బాక్స్‌తో రోడ్లపైకి
ఇదిలాఉంటే ఈ ఇద్దరు మిత్రులకు మూగజీవాలంటే ప్రాణం. ఈ కారణంతోనే వాటికోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. అదే- వీధి కుక్కలు, పిల్లుల సంరక్షణ. ఇందులో భాగంగానే వీధుల వెంట, రోడ్లపై తిరిగే కుక్కలు, పిల్లులకు కావాల్సిన ఆహారమే కాకుండా వాటికి అనారోగ్యం తలెత్తితే ఆస్పత్రిలో చూపించేందుకు అవసరమయ్యే నగదును పోగు చేయాలనుకున్నారు. ఇందుకోసం కోల్‌కతా నగర రోడ్లపై, కూడళ్లల్లో నిలబడి ప్రజల వద్ద భిక్షాటన చేస్తున్నారు. అలా కొందరు ఇచ్చే ఎంతోకొంత డబ్బుతో వివిధ ప్రాంతాల్లో ఆపదలో ఉన్న అనేక మూగజీవాలను ఆదుకుంటున్నారు. వాటికి సేవ చేసుకుంటున్నారు. తాము యాచించేందుకు గల కారణాలను వివరిస్తూ ఓ ప్లకార్డుతో పాటు చిన్నపాటి డొనేషన్ బాక్స్‌ను పట్టుకొని తిరుగుతున్నారు. ఇలా వారంలో కొన్ని రోజులు భిక్షాటన చేస్తున్నారు మధురీతు దే, అనురభ్ రాయ్.
సంరక్షణే కాదు
కేవలం వీధి కుక్కలు, పిల్లుల సంరక్షణ బాధ్యతే కాదు, మూగజీవాల పట్ల కొందరు ప్రదర్శిస్తున్న తీరును ఖండిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు మధురీతు దే, అనురభ్ రాయ్. ఈ విషయంలో అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇది కూడా జంతువుల పట్ల తమకున్న లక్ష్యాల్లో ఒకటని చెబుతున్నారు ఈ ఫ్రెండ్స్. మరోవైపు కుక్కల పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సర్మేయా అనే పేరుతో సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుండడం వల్ల అనేక ప్రాంతాల నుంచి కుక్కలను రక్షించాలంటూ కాల్స్ సైతం వస్తున్నాయని చెబుతున్నారు ఈ పెట్ లవర్స్.
"మేము చేస్తున్న ఈ మంచి పనిని మరింత విస్తరించడమే మా లక్ష్యం. మా వ్యక్తిగత డబ్బును కూడా వీలైనంతగా ఇందుకోసం వినియోగిస్తున్నాము. కానీ, రోజురోజుకు ఒత్తిడి మరింతగా పెరుగుతోంది. ఇందుకు కారణం మా కార్యక్రమానికి మంచి ఆదరణ వస్తుండడమే. కొందరు ఆహారాన్ని డొనేట్ చేస్తుంటే మరికొందరు డబ్బు రూపేణా తమ సాయాన్ని అందిస్తున్నారు. మా అంతిమ లక్ష్యం మూగజీవాలను కాపాడటమే. ఈ మధ్య వీటిని(కుక్కల, పిల్లులను) హింసించే శాతం కూడా అధికమైంది. దీనిపై చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అవగాహన కల్పిస్తున్నాము."
- మధురీతు దే, అనురభ్ రాయ్, భిక్షాటన చేస్తున్న స్నేహితులు
స్థిరంగా బంగారం, వెండి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
ఎల్‌ఐసీలో 250 అప్రెంటీస్ జాబ్స్- అప్లైకు మరో 8 రోజులే ఛాన్స్!