వ్యాపార ఆధారిత మనీలాండరింగ్ కుంభకోణం కేసులో ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు తెలిపారు. నకిలీ సాఫ్ట్వేర్ దిగుమతి కేసులో.. దీపక్ అగర్వాల్, అయూష్ గోయెల్ రూ.1,500 కోట్లను విదేశాలకు అక్రమంగా తరలించినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు.
ఈ కుంభకోణంలో ఫిబ్రవరి 22న అగర్వాల్‌ను, అదే నెల 27న గోయెల్‌ను అరెస్ట్ చేసినట్టు చెప్పిన అధికారులు.. నిందితులు ఇద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్టు చెప్పారు. ఈ మేరకు మార్చి 6 నుంచి 9 వరకు అగర్వాల్‌కు కోర్టు మూడు రోజుల కస్టడీని మంజూరు చేసినట్టు కూడా వివరించారు. అయితే.. మరో నిందితుడు గోయెల్‌పై విచారణ జరగాల్సి ఉందన్నారు.
ఇదీ కేసు..
ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఫిర్యాదుతో వడ్డి మహేశ్, ఇతరులపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. దాని ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. మహేశ్.. పలువురితో కుమ్మక్కై దేశంలో బోగస్ సంస్థలు, కంపెనీలను విలీనం చేశారని.. ఈ సంస్థలు ఆయా పేర్లతో బ్యాంకు ఖాతాలను కూడా ప్రారంభించినట్టు దర్యాప్తులో వెల్లడైందని వివరించింది ఈడీ. ఈ కేసులో మహేశ్.. తన బ్యాంకు ఖాతాకు ప్రమోద్ అగర్వాల్, గోయెల్, వికాస్ గుప్తా, వినీత్ గోయెంకా నుంచి నిధులు మరల్చుకుని.. ఆ కంపెనీల బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్టు వెల్లడైందని స్పష్టం చేసింది. ఆ తర్వాత.. నకిలీ సాఫ్ట్వేర్ దిగుమతి కోసం.. చెల్లింపుల ముసుగులో సింగపుర్, హాంకాంగ్, చైనాలోని పలు సంస్థలకు ఈ నిధులను తరిలించినట్టు పేర్కొంది.
ఈ కేసులో దీపక్ అగర్వాల్.. హాంకాంగ్‌కు చెందిన ఓ సంస్థకు డైరెక్టర్‌గా ఉండి.. రూ.300 కోట్ల కుంభకోణంలో భాగస్వామి అయినట్టు ఈడీ అధికారులు తెలిపారు. గోయెల్, మహేశ్‌లు నగదు చెల్లింపులు జరపడం సహా.. దేశీయ నిధులను విదేశాలకు తరలించేందుకు సూచనలిచ్చినట్టు తేలిందని వారు చెప్పారు.
ఇదీ చదవండి: 'లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తాం'