త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో బిహార్‌లో మిత్రపక్షాలైన జనతాదళ్ యునైటెడ్(జేడీయూ), భాజపాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవల జేడీయూ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ చేసిన వ్యాఖ్యలతో అవి మరింత ముదిరాయి. మిత్రపక్షమైన తమకు కేబినెట్ విస్తరణలో గౌరవప్రదమైన స్థానం కల్పించాలని జేడీయూ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు లోక్జనశక్తిపార్టీలో(ఎల్జేపీ) ముసలం వల్ల ఆ పార్టీ నేత పశుపతి కుమార్ పరాస్‌కు కేబినెట్లో చోటుదక్కే అవకాశముందని గట్టిగా వినిపిస్తోంది. ఎల్జేపీలో తిరుగుబావుటా ఎగురవేసి, పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజే తనకు కేంద్ర మంత్రి పదవి తథ్యం అని పశుపతి సూచనప్రాయంగా చెప్పారు. కేబినెట్లో బెర్తు ఖరారు చేసుకున్నాకే పుశుపతి ఎల్జేపీలో తిరుగుబావుటా ఎగురవేశారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో తమ పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించకపోవచ్చన్న గుబులు జేడీయూలో పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అప్పట్లో నో చెప్పిన నితీశ్
2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. అప్పట్లో జేడీయూకు మంత్రివర్గంలో చోటిచ్చింది. అయితే భాజపా ఈ అవకాశాన్ని పేరుకే ఇచ్చిందని.. ఒక్క స్ధానంపై విముఖతతో సీఎం నితీశ్ కమార్ అందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం జేడీయూ-భాజపాల మధ్య అలాంటి పరిస్థితే తలెత్తింది. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో మూడు, మరో రెండు సహాయ మంత్రి స్థానాలు తమ పార్టీకి కేటాయించాలని జేడీయూ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మిత్రపక్షాలకు తగిన గౌరవం ఇవ్వాలన్న ఆర్సీపీ సింగ్ వ్యాఖ్యలతో ఇరుపార్టీల మధ్య విబేధాలు తీవ్ర రూపం దాల్చాయి.
'ఎల్జేపీ కుట్ర'
"బిహార్‌లో భాజపా నుంచి 17మంది, జేడీయూ నుంచి 16 మంది పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీని ఆధారంగా కేంద్ర మంత్రివర్గంలో బిహార్ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. అయితే వారంతా భాజపా నేతలే. మరి కేంద్ర మంత్రివర్గంలో నలుగురు, ఐదుగురు జేడీయూ నేతలకు ఎందుకు స్థానం కల్పించలేదు? రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు సమానంగా సీట్లు కేటాయించాం. మరి కేంద్ర కేబినెట్లో మాకు తగిన ప్రాధాన్యం ఎందుకు ఇవ్వడం లేదు? రెండోసారి కూడా మా అభ్యర్థనను భాజపా పరిగణించకపోతే.. దురదృష్టకరం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్జేపీ మా సంతోషాన్ని చెడగొట్టేందుకు కుట్ర పన్నుతోంది." అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ జేడీయూ నేత ఆరోపించారు.
ఎల్జేపీ దివంగత నేత రాంవిలాస్ పాసవాన్ చివరి శ్వాస వరకు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన మరణాంతరం కేబినెట్లో ఎల్జేపీకి స్థానం లభించలేదు. అయితే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా.. లోక్‌సభలో పశుపతి వర్గాన్ని అసలైన ఎల్జేపీగా గుర్తించారు స్పీకర్ ఓం బిర్లా. దీంతో పశుపతికి కేబినెట్ బెర్త్ పక్కా అని బిహార్‌లో గట్టిగా వినిపిస్తోంది. అలాగే జేడీయూ నుంచి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్, ఆర్సీపీ సింగ్, సంతోష్ కుమార్, రాంనాథ్ ఠాకూర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు భాజపాలో ఇప్పటికే కేంద్ర మంత్రి అయిన గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, అశ్విని కుమార్ చౌదురి, రవిశంకర్ ప్రసాద్, ఆర్కే సింగ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
"గతంలోనూ భాజపా, జేడీయూ మధ్య ఇలాంటి పోరు నెలకొంది. చివరకు మోదీ అనుకున్నదే చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులు మారాయి. అకాలీ దళ్.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. మరోవైపు శివసేన భాజపాకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తుంది. అలాగే వచ్చేఏడాదిలో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితులన్నీ జేడీయూను కేబినెట్లోకి తీసుకోవాలన్న సంకేతాలు ఇస్తున్నాయి. అయితే కేంద్ర మంత్రివర్గంలో జేడీయూకు రెండు బెర్తుల కంటే ఎక్కువ లభిస్తాయని భావించట్లేదు."
-- డాక్టర్ సంజయ్ కుమార్, రాజకీయ విశ్లేషకులు
రెండు బెర్తులే!
ఎల్జేపీలోని అసమ్మతి ఎంపీలు జేడీయూలో విలీనమై ఉంటే.. వారి సంఖ్య 21 చేరి.. జేడీయూ ఒత్తిడి రాజకీయాలు బాగా పని చేసేవి. అయితే ఈ వ్యూహం కార్యరూపం దాల్చలేదు. ఎల్జేపీ స్వతంత్ర పార్టీగా మిగిలిపోయింది. కాబట్టి ఈ లాజిక్‌తో వెళితే, జేడీయూకు రెండు క్యాబినెట్ బెర్త్‌ల కంటే ఎక్కువ లభించకపోవచ్చు.
భాజపాకు నితీశ్ తలొగ్గుతారా?
"జేడీయూలో ఎల్జేపీని విలీనం చేయాలన్న నితీశ్ ప్రణాళిక భాజపాకు తెలిసి ఉండాలి. అందుకే పశుపతికి కేంద్ర కేబినెట్లో స్థానం ఇవ్వడానికి వారు అంగీకరించారు. తద్వారా జేడీయూ ఒత్తిడి రాజకీయాలు చేయలేదు. భాజపా ఇచ్చింది అందిపుచ్చుకోవడం తప్ప జేడీయూకు వేరే గత్యంతరం ఉండదు. ఎంపీల సంఖ్య ఎక్కువ ఉంటే జేడీయూ బేరం కుదుర్చుకునేది. ఇప్పుడు జేడీయూ మద్దతును ఉపసంహరించుకున్నప్పటికీ భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పడిపోదు. కాబట్టి భాజపా చెప్పిందానికి నితీశ్ తలాడించాల్సిందే" అని డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు.
మారిన పరిస్థితులేంటి?
ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. ప్రధాని మోదీని కలవడం, అలాగే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్.. ప్రధానిని దేశంలోనే అగ్రనేతగా పిలవడం చూస్తుంటే.. గతేడాదితో పోల్చుకుంటే పరిస్థితులు మారాయి అని స్పష్టమవుతోంది. అలాగే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఎన్సీపీ నేత శరద్‌పవార్‌ను కలివడం చూస్తే మహావికాస్ అఘాడీలో లుకలుకలు మొదలైనట్లు కనిపిస్తోంది.
'ఒప్పందాలు లేవు'
"కేబినెట్ సీట్ల వివాదంపై భాజపా, జేడీయూలను ప్రతిపక్ష పార్టీలు అపహాస్యం చేశాయి. "అధికార ఫలాల వాటా కోసం కూటమిలోని ఇరుపార్టీల మధ్య పోరు జరుగుతోంది. జేడీయూ అధిక వాటా పొందాలనుకుంటుంది. ఇందుకు భాజపా ఇష్టపడదు. చివరికి భాజపా విజయం సాధిస్తుంది. ఈ కూటమికి ఎలాంటి సిద్ధాంతాలు, రాజకీయ ఒప్పందాలు లేవు. రాష్ట్రంలో ఎలాగోలా అధికారంలోకి వచ్చిన కూటమిలో విభేదాలు ఇప్పుడు బయట పడుతున్నాయి. " అని కాంగ్రెస్ ప్రతినిధి కుంతల్ కృష్ణ విమర్శించారు.
ఇవీ చూడండి: