TSPSC Paper Leak News in Telugu : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సిట్ దర్యాప్తు సాగుతోన్న కొద్దీ.. కొత్త కొత్త నిందితుల చిట్టా తెరపైకి వస్తూనే ఉంది. ఇన్ని రోజులుగా కమిషన్ కార్యాలయం నుంచే పేపర్లు లీక్ అయినట్లు భావించిన సిట్ అధికారులు.. పరీక్షా కేంద్రం నుంచీ ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు వెల్లడి కావడంతో నివ్వెరపోతున్నారు. ఈ క్రమంలోనే ఇంకా ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయన్న దానిపై దృష్టి సారించారు. పరీక్షలు రాసే అభ్యర్థులు ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చుంటారనే వివరాలూ బయట ఉన్న వ్యక్తులకు తెలియడంతో మొత్తం పరీక్షల నిర్వహణ వ్యవస్థపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
DEE Ramesh in TSPSC Paper Leak Case : ఇప్పటి వరకు ఈ కేసులో అందరి దృష్టి ప్రధాన నిందితుడు ప్రవీణ్‌పైనే ఉండగా.. తాజాగా 'అంతకు మించి' అనేట్లుగా వెలుగులోకి వచ్చిన విద్యుత్ శాఖ డీఈఈ రమేశ్ ముఠా తీరు అందరూ నోరెళ్లబెట్టేలా చేసింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన డీఏవో, ఏఈఈ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేయించిన వ్యవహారం బయటపడటంతో ఈ ముఠా పూర్వాపరాలపై సిట్ మరింత లోతుగా ఆరా తీస్తుంది. ఈ క్రమంలోనే మరిన్ని కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. డీఈఈ రమేశ్ జనవరిలో జరిగిన స్త్రీ-శిశు సంక్షేమ శాఖ సూపర్‌వైజర్ పరీక్ష సమయంలోనూ మాస్ కాపీయింగ్ చేయించేందుకు ప్రయత్నించినట్లు, సాంకేతిక కారణాల వల్ల అది విఫలమైనట్లు సిట్ విచారణలో తేలింది.
- ఇవీ చూడండి..: TSPSC Paper Leak Updates : వీళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్.. మాస్ కాపీయింగ్ కోసం ఏకంగా..!
సమాధానాలు వెతికేందుకు ఒక్కొక్కరికి రూ.10,000 : ఇప్పటి వరకూ టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో పని చేసే ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిల ద్వారా ప్రశ్నపత్రం పొందిన వారి జాబితా బయటపడగా.. ఇప్పుడు డీఈఈ రమేశ్ వంతు వచ్చింది. మాస్ కాపీయింగ్‌లో రమేశ్‌కు సహకరించిన వారు, అతని ద్వారా లబ్ధి పొందిన వారి జాబితా సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఈ ప్రశ్నపత్రాల్లో సమాధానాలు వెతికేందుకు సహకరించిన ఏడుగురికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున రమేశ్ ముట్టజెప్పినట్లుగా సిట్ విచారణలో తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ క్వశ్చన్ పేపర్ల విక్రయాల్లో మరికొంతమంది దళారులు ఉండొచ్చని సిట్ భావిస్తోంది.
ఇంకా ఎవరెవరు సహకరించారో.. : పోటీ పరీక్షల్లో కాపీయింగ్‌ను కట్టడి చేసేందుకు టీఎస్‌పీఎస్సీ అనేక చర్యలు తీసుకుంది. ఇందులో ప్రధానమైనది జంబ్లింగ్ విధానం. ఈ విధానంలో అన్ని ప్రశ్నపత్రాల్లోనూ ప్రశ్నలు సేమ్ ఉన్నా.. వాటి క్రమ సంఖ్య మాత్రం వేరుగా ఉంటుంది. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు వరుసగా ఏ,బీ,సీ,డీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి నాలుగు సెట్ల ప్రశ్నపత్రాలు ఇస్తూ వెళతారు. అంటే మొదట కూర్చున్న అభ్యర్థికి 'ఏ' సెట్‌లోది.. తర్వాత కూర్చున్న అభ్యర్థికి 'బి' సెట్లోది.. ఇలా 4 సెట్ల పేపర్లు ఇస్తారు. మధ్యలో ఎవరైనా అభ్యర్థులు పరీక్షకు రాకపోతే.. ఆ ప్రశ్నపత్రం తమవద్దే ఉంచుకుని.. ఐదో అభ్యర్థి నుంచి మళ్లీ మొదటి సెట్ నుంచి పేపర్ ఇవ్వడం మొదలుపెడతారు. అంతే తప్ప.. గైర్హాజరైన అభ్యర్థికి ఇవ్వాల్సిన ప్రశ్నపత్రాన్ని తర్వాతి అభ్యర్థికి ఇవ్వరు.
ఎగ్జామ్ హాల్‌లో అభ్యర్థులు ఎక్కడ కూర్చోవాలనేదీ కమిషన్ కార్యాలయంలోనే కంప్యూటర్ ద్వారా ర్యాండమైజేషన్ చేసి పంపుతారు. ఇంత పకడ్బందీగా ఉండే ఈ జంబ్లింగ్ విధానాన్ని మాస్ కాపీయింగ్‌కు తోడ్పడ్డ రమేశ్ పసిగట్టాడు. టోలిచౌకీలో నివసించే ఓ ప్రిన్సిపల్ ద్వారా ప్రశ్నపత్రాలు సేకరించాడు. అయితే.. ఏ బెంచీపై కూర్చున్న అభ్యర్థికి ఏ సెట్ ప్రశ్నపత్రం వచ్చిందన్న వివరాలు రమేశ్‌కు ఇంకా వేరెవరో అందించి ఉంటారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇవీ చూడండి..
TSPSC Paper Leak Case : నిందితుడు డీఈఈ రమేశ్ కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్
TSPSC Paper Leak Update : పేపర్ లీకేజీలో భారీ స్కామ్.. రూ.కోట్లలోనే వ్యవహారం