గుజరాత్లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదైంది. శుక్రవారం అర్థరాత్రి తరువాత ఈ భూకంపం సంభవించింది. సూరత్ జిల్లాలో 12.52 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ అధికారులు తెలిపారు. సూరత్‌కు పశ్చిమ నైరుతి తీరాన 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు వారు వెల్లడించారు. ఇది హజీర జిల్లా సమీపాన.. అరేబియా సముద్రంలో ఉన్నట్లు గుర్తించారు. 5.2 కిలోమీటర్ల లోతులు భూకంపం కేంద్రం ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
భవిష్యత్‌లో మరిన్ని భూకంపాలు..
మరోవైపు, భారత్‌లో భూకంపాలు వచ్చే అవకాశాలపై ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్ జావెద్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. సైన్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన.. భారత్‌లో రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రతతో భూకంపాలు వచ్చే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఈ మధ్య కాలంలోనే దిల్లీ, లక్నోలో వచ్చిన భూకంపాల గురించి గుర్తుచేశారు.
భవిష్యత్‌లో హిమలయాలు, కచ్ ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2004లో రిక్టర్ స్కేల్‌పై 9.1 తీవ్రతతో అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అదే విధంగా రిక్టర్ స్కేల్‌పై 7.5 నుంచి 8.7 తీవ్రతతో మధ్య హిమాలయాలలోని కుమావోన్ హిమాచల్ ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు తెలిపారు.
59 శాతం భూభాగానికి ముప్పు..
తుర్కియే, సిరియాలో భూప్రళయంతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఈ నేపథ్యంలో.. మన దేశంలో భూకంపం సంభవించే అవకాశాలు ఉన్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 59 శాతం భూభాగం.. భూకంపాలకు గురయ్యే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం.. భారత భూఫలకం ఏడాదికి 47 మిల్లీమీటర్ల వేగంతో ఆసియా ఫలకంలోకి చొచ్చుకుపోవడమేనని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
గుజరాత్‌లోనూ..
ఈ భూకంప ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్ కూడా ఉంది. గుజరాత్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 1819, 1845, 1847,1848, 1864, 1903, 1938, 1956, 2001లో అతిపెద్ద భూకంపాలు సంభవించాయి. 2001లో వచ్చిన కచ్ భూకంపం గత రెండు దశాబ్దాల్లో వచ్చిన అతిపెద్దది. ఈ ఘటనలో 13,800 మంది మృతి చెందారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు.