Transgender Love Story: పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి తన నుంచి డబ్బు తీసుకొని మోసానికి పాల్పడ్డాడంటూ ఓ ట్రాన్స్‌జెండర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహం చేసుకుంటానంటూ నమ్మించి తన నుంచి నగదు మొత్తాన్ని తీసుకుని మోసగించాడంటూ ట్రాన్స్ జెండర్ చేసిన ఫిర్యాదుపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన పవన్ కుమార్ (ట్రాన్స్ జెండర్‌గా మారిన తరువాత భ్రమరాంబిక) కృష్ణలంకకు చెందిన నాగేశ్వరరావులు సుమారు ఆరేళ్ల క్రితం కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాలలో బీఈడీ కలిసి చదువుకునే సమయంలో ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.
డిగ్రీ వరకు అబ్బాయిలా .. పీజీలో అమ్మాయిలా మారి..
ఆ ఇష్టం కాస్తా ప్రేమగా మారడంతో కళాశాలలో చదువు పూర్తయిన అనంతరం ఇద్దరూ 2013లో కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్ సమీపంలో మగవారిగానే పరిచయం చేసుకుని ఒక ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేశారు. అదే సమయంలో కృష్ణలంకలో ట్యూషన్ పాయింట్‌ను నిర్వహించారు. ట్యూషన్ పాయింట్‌కు వచ్చే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వీరిద్దరూ మగవారిగానే తెలుసు.
అయితే కొద్ది రోజులకు ఇద్దరూ వివాహం చేసుకుందామన్న నిర్ణయానికి రావడంతో నాగేశ్వరరావు.. పవన కుమార్‌ను దిల్లీ తీసుకెళ్లి అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయించి అతడి పేరును భ్రమరాంబికగా మార్చాడు. శస్త్ర చికిత్సకు ఖర్చు సొమ్ము సుమారు 11 లక్షల రూపాయలను భమరాంబికనే చెల్లించింది.
ట్రాన్స్ఉమన్తో యువకుడి పెళ్లి.. తల్లిదండ్రులు నో చెప్పినా...
కొద్ది రోజులకు ట్యూషన్ పాయింట్లో తన వాటాగా వచ్చిన సొమ్మును, అదే విధంగా పొలం విక్రయించగా వచ్చిన రూ. 20 లక్షలు కలిపి.. మొత్తంగా 25 లక్షల రూపాయలను వివాహం చేసుకుంటాడన్న నమ్మకంతో భ్రమరాంబిక.. నాగేశ్వరరావుకు ఇచ్చింది. ఇలా ఉండగా గతేడాది డిసెంబర్లో పెళ్లికి నిరాకరించిన నాగేశ్వరరావు ఆమెను ఇంటి నుంచి పంపించేశాడు. తరువాత నాగేశ్వరరావు తన తల్లి విజయలక్ష్మితో కలిసి మంగళగిరి వెళ్లిపోయాడు. గత్యంతరం లేని స్ధితిలో భ్రమరాంబిక పెనమలూరులో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.
నాగేశ్వరరావు మంగళగిరిలో ఉన్నాడన్న సమాచారంతో అతడిపై ఫిర్యాదు చేసేందుకు ఇటీవల భ్రమరాంబిక మంగళగిరి పోలీసులను ఆశ్రయించగా వ్యవహారం మొత్తం కృష్ణలంక కేంద్రంగా జరిగినందున అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా వారు సూచించారు. దీంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న భ్రమరాంబిక వివాహం చేసుకుంటానంటూ నమ్మించి నమ్మక ద్రోహానికి పాల్పడి, నగదు మొత్తాన్ని తీసుకుని మోసానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు పిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నాగేశ్వరరావు, అతడి తల్లి విజయలక్ష్మిలపై మోసం, నమ్మకద్రోహం, ట్రాన్స్ జెండర్ హక్కుల రక్షణ చట్టంపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.