Transgender Cafe in Mumbai: ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో కస్టమర్లను ఆకర్షిస్తుంటారు హోటల్ నిర్వాహకులు. అలాంటి కోవకే చెందుతుంది బాంబే నజరియా కేఫ్. ఇది ముంబయి అంధేరి వెస్ట్జీత్ నగర్‌లోని వెర్సోవాలో ఉంది. ఈ కేఫ్ ప్రత్యేకత ఏమిటంటారా? ఇందులో పనిచేసేవారు అంతా ట్రాన్స్జెండర్లే. ఆహార పదార్థాల తయారీ నుంచి డెలివరీ, క్లీనింగ్ వరకు అన్ని పనులు వారే చేస్తుంటారు. ట్రాన్స్జెండర్లకు మాత్రమే ఇందులో పనిచేసే అవకాశం కల్పిస్తుండటం గమనార్హం. సమాజంలో వారిపట్ల ఉన్న భావనను మార్చేందుకే ఇలా చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.
బాంబే నజరియా కేఫ్‌ను రెండు నెలల క్రితం డియాగో మిరండా అనే వ్యక్తి ప్రారంభించారు. ట్రాన్స్జెండర్ల కోసం ఏదైనా చేయాలని మిరండా తండ్రి ఎప్పుడూ చెబుతుండేవారు. దీంతో కేఫ్‌లో వారికి అవకాశం కల్పిస్తే తన తండ్రి కోరికను నెరవేర్చవచ్చని భావించిన మిరండా.. ఆ దిశగా చర్యలు చేపట్టారు. హోటల్ పనుల్లో అనుభవం ఉన్న ట్రాన్స్జెండర్లను నియమించుకున్నారు.
సిబ్బంది మొత్తం వారే..
ఈ కేఫ్‌లో చెఫ్ నుంచి డెలివరీ, క్లీనింగ్ వరకు పనిచేస్తున్న సిబ్బంది మొత్తం ట్రాన్స్జెండర్లే కావడం వల్ల కస్టమర్లను విశేషంగా ఆకర్షిస్తోంది. పావ్‌బాజీ, కీమా పావ్, మిసాల్ పావ్, కశ్మీర్ పింక్ టీ వంటివి ఇక్కడ ఫేమస్.
"నేను ట్రాన్స్‌జెండర్‌ను. గతంలో నేను హమ్సఫార్లో హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తుల కోసం ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేశాను. కానీ, నాకు వంటలు చేయటమంటేనే ఇష్టం. అన్ని రకాల వంటలు చేయగలను. అందులో మిస్సాల్ పావ్ చాలా బాగా చేస్తాను. దీనిని కస్టమర్లు ఇష్టంగా తింటారు. ఈ కేఫ్‌లో ట్రాన్స్‌జెండర్ చెఫ్ అవసరం ఉందని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. నాకు శిక్షణ ఇచ్చి పనిలో చేర్చుకున్నారు."
- సున్యా జాదవ్, ట్రాన్స్‌జెండర్ చెఫ్.
ఇక్కడికి వచ్చిన కస్టమర్లు తమను ప్రేమగా పలకరిస్తారని కేఫ్‌లో పనిచేసే అక్షరా భాగ్నే తెలిపారు. తాను కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకుని ఆహారం అందిస్తానని చెప్పారు. ట్రాన్స్జెండర్ల పట్ల ప్రజల్లో ఉన్న భావనను మార్చేందుకే కేఫ్‌కు బాంబే నజరియాగా పేరు పెట్టినట్లు చెప్పారు యజమాని. 'చూసే కోణం మారితే.. ఆలోచన మారుతుంది' అనే తమ నినాదాన్ని ఇది ప్రతిబింబిస్తోందన్నారు.
ఇదీ చూడండి: కాలేజ్‌లో ప్రేమ.. ఉద్యోగంలో సహజీవనం.. పెళ్లి అనేసరికి కులం.. పెట్రోల్ పోసి..