మానవ వనరుల నిర్వహణ ప్రణాళికలో భాగంగానే.. దిల్లీ బేస్ ఆస్పత్రికి చెందిన కమాండెంట్, మేజర్ జనరల్ వాసు వర్ధన్ బదిలీ జరిగిందని భారత ఆర్మీ తెలిపింది. ఆయనపై పని ఒత్తిడిని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
ఈ వారం ప్రారంభంలో.. దిల్లీ బేస్ ఆస్పత్రి నుంచి భారత ఆర్మీలోని రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రికి వాసు వర్ధన్ బదిలీ జరిగింది.
"దిల్లీ బేస్ ఆస్పత్రిలో వాసు వర్ధన్‌పై పనిభారం పెరిగింది. ఏడాది కాలంగా ఆస్పత్రి పాలనా బాధ్యతలను నిర్వర్తిస్తూనే కొవిడ్ రోగులకు ఆయన సేవలందిస్తున్నారు. అంతేకాకుండా.. ఇటీవలే ఆయన తన బంధువుల్లో ఒకరిని కోల్పోయారు. ఇప్పుడు ఆయన విధులను మార్చటం ద్వారా ఆయనపై ఒత్తిడి తగ్గుతుంది. మానవ వనురుల నిర్వహణ ప్రణాళికలో భాగంగానే వాసు వర్ధన్ బదిలీ జరిగింది."
- ఆర్మీ
వాసు వర్ధన్ ఈ ఏడాది ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. దిల్లీ బేస్ ఆస్పత్రిలో 18 నెలలకుపైగా ఆయన సేవలందించారు. లఖ్‌నవూలోని ఆర్మీ ఆస్పత్రి డిప్యూటీ కమాండెంట్... దిల్లీ బేస్ ఆస్పత్రిలో కమాండెంట్‌గా వాసు వర్ధన్ స్థానంలో సోమవారం నుంచి బాధ్యతలు చేపట్టారు.
650 పడకలు ఉన్న దిల్లీ బేస్ ఆస్పత్రిలో.. సైనికులకు కొవిడ్ చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి: బిహార్‌లో మే 25 వరకు లాక్డౌన్ పొడిగింపు
ఇదీ చూడండి: నదిలో మృతదేహాలపై ఎన్హెచ్ఆర్సీ నోటీసులు