Tractor Collides With Flight In Chennai : తమిళనాడులోని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల లగేజ్‌తో వెళ్తున్న ఓ ట్రాక్టర్.. ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం స్పల్పంగా దెబ్బతింది. వెంటనే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) అధికారులు.. విమానాన్ని తనిఖీ చేసి నిలిపివేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న దిల్లీలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-డీజీసీఏ విచారణకు ఆదేశించింది.
ఈ ఘటనపై ఇండిగో సంస్థ ప్రకటన జారీ చేసింది. ప్రయాణికుల వస్తువులతో వెళ్తున్న ట్రాక్టర్ విమానాన్ని ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలిపింది. చెన్నై నుంచి తిరుచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమాన 24 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. స్పల్పంగా ధ్వంసమైన విమానానికి మరమ్మతులు జరుగుతున్నట్లు తెలిపింది. నవంబర్ 22వ తేదీ నుంచి సర్వీసులను పునరుద్ధరిస్తామని వెల్లడించింది. ప్రయాణికులకు విమాన ఛార్జీలను రీఫండ్ చేస్తామని చెప్పింది.
'ఎలాంటి గాయాలు కాలేదు'
ఈ ప్రమాదంపై చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులు కూడా విచారణ చేపట్టారు. బీసీఏఎస్తో పాటు డీజీసీఏ అనుమతి పొందిన తర్వాతే విమాన సర్వీస్ ప్రారభమవుతుందని చెప్పారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు.
రన్‌వేపై అదుపుతప్పి..
కొన్నిరోజుల క్రితం.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి వెళ్లిన ఓ విమానం.. ముంబయి విమానాశ్రయంలో భారీ ప్రమాదానికి గురైంది. ప్రైవేటు సంస్థకు చెందిన ఆ చిన్న విమానం రన్‌వేపై అదుపు తప్పి.. పక్కకు దూసుకెళ్లి క్రాష్ అవ్వగా ఎనిమిది మంది గాయపడ్డారు. ఘటనా సమయంలో భారీ వర్షం కురుస్తోందని డీజీసీఏ అధికారులు వెల్లడించారు. విమానంలో ఆరుగురు ప్రయాణికులతోపాటు ఇద్దరు సిబ్బంది ఉండగా.. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమై మంటలు చెలరేగకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన విమానాన్ని VSR వెంచర్స్‌కు చెందిన లీర్‌జెట్ 45 VT-DBLగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న వారంతా గాయపడ్డారని.. చికిత్స కోసం వారిని ఆస్పత్రి తరలించినట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన చిత్రాలను చూసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
విమానంలో 'హైజాక్' అంటూ ఫోన్లో ముచ్చట్లు.. నిమిషాల్లో ప్రయాణికుడి అరెస్ట్!
కాలుతున్న వాసనతో విమానం అత్యవసర ల్యాండింగ్.. ఉల్లిపాయలే కారణం!