Punjab Raj Bhavan Tomato Ban News : టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. పంజాబ్ గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అధికారిక నివాసమైన రాజ్భవన్లో టమాటాల వినియోగంపై తాత్కాలికంగా నిషేధం విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన పంజాబ్ గవర్నర్.. సాధారణ ప్రజలు సైతం టమాటాలను వినియోగించొద్దని పిలుపునిచ్చారు. టమాటాల ధరల పెరుగుదలతో ప్రజలు అనుభవిస్తున్న బాధలను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు. అందుకోసమే కొన్ని రోజుల పాటు టమాటాల వినియోగాన్ని పౌరులు తగ్గించుకోవాలని ఆయన సూచించారు.
"టమాటా ధరలు భారీగా పెరగడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకు నేను చాలా చింతిస్తున్నాను. ప్రజలకు నా సానుభూతి తెలుపుతున్నాను. ధరలు తగ్గే వరకు ప్రజలంతా టమాటాలకు దూరంగా ఉండండి. మనం టమాటాలను తక్కువగా వినియోగిస్తే డిమాండ్ తగ్గి.. ధరలు తామంతటవే దిగి వస్తాయి." అని గవర్నర్ సూచించారు. కొద్ది రోజుల పాటు ప్రజలు టమాటా వినియోగాన్ని తగ్గిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పంజాబ్లో కిలో టామాటా ధర రూ.200-220 వరకు ఉంది. రానున్న రోజుల్లో వీటి ధర దాదాపు రూ.300 వరకు పెరగవచ్చని హోల్సేల్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ధరల పెరుగుదలకు వాతావరణ పరిస్థితులు, సరఫరా గొలుసుకు అంతరాయం, మార్కెట్ డైనమిక్స్ వంటివి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టామాటా ధరలు ఈ స్థాయిలో పెరగడం వల్ల అక్కడక్కడ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి.
'ధరలు తగ్గేలా చూడు దేవుడా!'.. టమాటాల దండలతో ప్రత్యేక పూజలు..
Tomato Garlands To Goddess : దేశంలో టమాటాల ధరలు తగ్గాలని తమిళనాడు నాగపట్టిణం జిల్లాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. 508 టమాటాలతో ప్రత్యేకంగా ఓ దండను తయారు చేసి.. దేవతా విగ్రహాలను అలంకరించారు. పూలు, నిమ్మకాయల మాలను సైతం దేవుళ్లకు సమర్పించుకున్నారు. మరియమ్మన్, నాగమ్మన్, మధురై వీరన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సుఖశాంతులతో ఉండాలని, టమాటా ధరలు తగ్గాలని భక్తులు భగవంతులను వేడుకున్నారు. దేవుళ్ల విగ్రహాలకు అభిషేకాలు సైతం నిర్వహించారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.