కరోనా రోగులకు ప్రాణవాయువుల కొరత తలెత్తిన వేళ మూడేళ్లుగా మూసి ఉన్న తూత్తుకుడి స్టెరిలైట్ కర్మాగారంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయంపై చర్చించేందుకు సీఎం పళనిస్వామి అధ్యక్షతన సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో.. 4 నెలల పాటు ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
2018లో దక్షిణ జిల్లాలో స్టెరిలైట్ వ్యతిరేక నిరసనల సందర్భంగా పోలీసుల కాల్పుల్లో 13 మంది ఆందోళనకారులు మరణించిన కొన్ని రోజుల తరువాత ఈ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం సీల్ చేసింది. ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి కోసం స్టెరిలైట్ ప్లాంట్ తెరిచేందుకు అవకాశం కల్పించాలని వేదాంత గ్రూప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు పోతుంటే మూసివేసిన పరిశ్రమల్లో ఉత్పత్తికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సుప్రీం ప్రశ్నించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తూత్తుకుడిలోని వేదాంత స్టెరిలైట్ కర్మాగారంలో ఆక్సిజన్ ఉత్పత్తికి సంబంధిత యంత్రాలను, పరికరాలు మాత్రమే నాలుగు నెలల పాటు కార్యకలాపాలు సాగించేందుకు విద్యుత్ సరఫరా చేసేందుకు అనుమతించారు. ఇతర కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 'ప్రాణాలు పోతున్నా ఆక్సిజన్ ఉత్పత్తి చేయరా?'