ప్రధాన కూడళ్లలో నేతల ఫ్లెక్సీలు
గోడలపై పార్టీల నినాదాలు
జెండాలు, కరపత్రాలు, గుర్తులు.. ఇలా అసెంబ్లీ సమరం జరుగుతున్న బంగాల్లో ప్రచారాలు జోరందుకున్నాయి. పార్టీల గుర్తులతో స్వీట్లు సైతం అందుబాటులోకి వచ్చాయంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రభావం ఎలా ఉందో స్పష్టమవుతోంది.
![TMC, Left candidates begin campaigning for Bengal polls](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10896841_wb-hwh-01-politicalsweet-wb10026_03032021123127_0303f_1614754887_905_0403newsroom_1614844438_937-5-2.jpg)
అంతటా బంగాలే!
ఐదు అసెంబ్లీల ఎన్నికల్లో యావద్దేశాన్ని ఆకర్షిస్తోంది బంగాల్ రాజకీయమే. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ.. దీదీ పాలనకు చరమగీతం పాడాలని భాజపా రంగంలోకి దిగుతున్నాయి. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోరాడుతూ తమ పార్టీలకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కాంగ్రెస్-లెఫ్ట్ కూటములు వ్యూహరచన చేస్తున్నాయి. ఇలా, పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బంగాల్లో ప్రచారం సైతం అత్యంత దూకుడుగా సాగుతోంది.
![TMC, Left candidates begin campaigning for Bengal polls](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10896841_evyxxvkvcag7zql-1.jpg)
నిజానికి ఎన్నికల వేడి మొదలవ్వక ముందు నుంచే బంగాల్ ప్రచారంలో పోటాపోటీగా తలపడ్డాయి పార్టీలు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా తొలి నుంచీ ఈ రాష్ట్రంపై అధికంగా దృష్టి పెట్టారు. టీఎంసీ సైతం అంతే దీటుగా ప్రచార పర్వంలో మునిగి తేలింది.
వ్యక్తిగత ప్రచార హోరు
ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం వల్ల పార్టీలు మరింత జోరు పెంచాయి. అభ్యర్థిత్వాలు ఖరారైన నేపథ్యంలో వ్యక్తిగత ప్రచారాలు ఊపందుకున్నాయి. బంగాల్లో 294 స్థానాలు ఉండగా.. టీఎంసీ 291 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. లెఫ్ట్ కూటమి 39 మంది నామినీలను ఖరారు చేసింది. దీంతో నేతలంతా ప్రచారంలోనే మునిగి తేలుతున్నారు.
![TMC, Left candidates begin campaigning for Bengal polls](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10896841_evyxxvkvcag7zql-2.jpg)
ఇంటింటి ప్రచారం
అశోకేనగర్ టీఎంసీ అభ్యర్థి ధిమన్ రాయ్ ఇంటింటి ప్రచారాన్ని మొదలు పెట్టారు. శనివారం ఉదయం నుంచి తన నియోజకవర్గంలోని ప్రజలను కలుస్తున్నారు. జాదవ్‌పుర్ అభ్యర్థి దేబబ్రత మజుందర్ సైతం ఓటర్లను కలుస్తున్నారు.
సీపీఎం పార్టీ ఝాడ్‌గ్రామ్ నామినీ మధుజా సేన్ రాయ్ సైతం తన నియోజకవర్గంలో క్యాంపెయిన్‌ను ఆరంభించారు.
భార్య, భర్త.. ఓ నియోజకవర్గం!
బెహాలా ప్రాంతంలో టీఎంసీ మద్దతు దారులు గోడలపై గ్రాఫిటీతో పేయింటింగ్లు వేశారు. బెహాలా పశ్చిమ, తూర్పు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్న పార్థా చటర్జీ, రత్నా చటర్జీలకు మద్దతుగా నినాదాలు రాశారు. కాగా, ఈ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోరుకు తూర్పు బెహాలా వేదిక కానుంది. తన భర్త, భాజపా నేత సోవన్ చటర్జీ నుంచి విడిపోయిన రత్న.. ఈ స్థానం నుంచి ఆయనపైనే పోటీకి దిగుతున్నారు. తూర్పు బెహాలాకు 2011 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు సోవన్.
ఈ నేపథ్యంలో ప్రచారానికి పదునుపెట్టారు రత్న. తన స్వగృహంలో పూజలు చేసి క్యాంపెయిన్‌కు నాంది పలికారు. ఈ స్థానం నుంచి గెలిచేందుకు తన శక్తిమేర కృషి చేస్తానని, మమతా బెనర్జీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు.
![TMC, Left candidates begin campaigning for Bengal polls](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10896841_evyxxvkvcag7zql-3.jpg)
లాభ్పుర్ నియోజకవర్గంలో ప్రచారాన్ని మొదలుపెట్టిన టీఎంసీ అభ్యర్థి అభిజిత్ సింఘా.. తనకు ప్రత్యర్థే లేరని చెబుతున్నారు. సునాయాసంగా ఈ స్థానాన్ని గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: బంగాల్ బరి: 'సరస్వతీ' మంత్రం పఠిస్తున్న తృణమూల్!
యాప్‌లతో ఓట్ల వేట
వ్యక్తిగత ప్రచారాలతో పాటు పార్టీ ప్రచారం సైతం ఉద్ధృతంగా సాగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ రాజకీయ ప్రచారాలను కొత్తదారుల్లో తీసుకెళ్తున్నాయి. సంప్రదాయ ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభలతో పాటు టెక్నాలజీనీ పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నాయి.
'పరివర్తన్ రథయాత్ర' అంటూ రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేసిన కాషాయ దళం.. 'మోదీపరా' పేరుతో మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీఎంసీ సైతం.. భాజపా రథయాత్రకు చెక్‌పెట్టేలా 'దీదీర్ దూత్' పేరుతో ప్రచార రథాలను రంగంలోకి దించింది. అదే పేరుతో యాప్‌ను లాంచ్ చేసి.. ఆన్‌లైన్‌లోనూ ప్రచారం చేస్తోంది.
ఇదీ చదవండి: ప్రచార పర్వం: భాజపా రథయాత్ర- ర్యాలీతో టీఎంసీ
బంగాల్లో ప్రచారం కోసం భాజపా ఓ పాటను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'గోర్బో సోనార్ బంగ్లా' పేరుతో రూపొందించిన ప్రచార గీతాన్ని విడుదల చేసింది.
![TMC, Left candidates begin campaigning for Bengal polls](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10896841_evyxxvkvcag7zql-4.jpg)
మోదీ 20- దీదీ 300
బంగాల్ ఎన్నికల కోసం భాజపా అగ్రనేతలు సైతం రంగంలోకి దిగనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20 బహిరంగ సభలకు హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఆదివారం బ్రిగేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగే ర్యాలీకి మోదీ హాజరు కానున్నారు.
మరోవైపు, టీఎంసీ సైతం దీటుగా ప్రచార ప్రణాళిక రూపొందించింది. ఏకంగా 300 సభలను నిర్వహించాలని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయించారు.
ఇలా.. ఓట్ల కోసం ప్రధాన పార్టీలు ప్రయోగిస్తున్న పోటాపోటీ ప్రచారాస్త్రాలతో బంగాల్ రాజకీయం రసవత్తర అధ్యాయానికి చేరుకుంది. ఇందులో ఎవరిది పైచేయి అన్న విషయం ఫలితాల తర్వాతే తేలేది.
294 స్థానాలు ఉన్న బంగాల్ అసెంబ్లీకి 8 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడవుతాయి.
బంగాల్ ఎన్నికలపై ప్రత్యేక కథనాలు: