వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బంగాల్లో అధికార టీఎంసీలోని అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. సీఎం మమతా బెనర్జీకి షాక్ ఇస్తూ తమ అసమ్మతిని బహిర్గతం చేస్తున్నారు పలువురు సీనియర్ నేతలు. మమతకు అత్యంత విశ్వాస పాత్రుడని గుర్తింపు ఉన్న తృణమూల్ కీలక నేత సువేందు అధికారి.. కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. లేఖను మమతకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఈ విషయాన్ని గవర్నర్కు ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరారు.
బంగాల్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న సువేందు.. హుగ్లీ రివర్ బ్రిడ్జ్ కమిషన్ ఛైర్మన్ పదవి నుంచి బుధవారమే తప్పుకున్నారు.
గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు సువేందు. కేబినెట్ సమావేశాలకు కూడా హజరుకావడం లేదు. పార్టీ అధిష్ఠానంపై ఆయన అసంతృప్తితో ఉండటమే ఇందుకు కారణం. సువేందు భాజపాలో చేరుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
సీఎం మమతా బెనర్జీపై సొంత పార్టీ నాయకులే వ్యతిరకేతతో ఉన్నారనేందుకు సువేందు రాజీనామానే నిదర్శనమని భాజపా విమర్శించింది. అయితే ఆయన తమ పార్టీలో చేరుతున్నారా? అనే విషయంపై మాత్రం స్పందించేందుకు నిరాకరించారు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ.
కీలక నేత..
సువేందు అధికారి టీఎంసీలో కీలక నేత. నందిగ్రామ్ ఉద్యమాన్ని ముందుండి నడిపించి 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి తీసుకొచ్చారు. ఆమెకు అత్యంత సన్నిహితుడు. కొంతకాలంగా పార్టీ వ్యవస్థాగత విషయాలపై తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. తూర్పు మిద్నాపుర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు.. బంగాల్ మరో 35 నుంచి 40 అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగల చరిష్మా ఉంది. బంకుర, పురులియా, ఝార్గ్రామ్ జిల్లాలో మంచి ఆదరణ ఉంది. అయితే సువేందు రాజీనామాపై తృణమూల్ పార్టీ మాత్రం మౌనం వహిస్తోంది.
కమలం గూటికి మరో సీనియర్ నేత..
పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీఎంసీ మరో సీనియర్ ఎమ్మెల్యే మిహిర్ గోస్వామి.. భాజపాలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కమల దళం పెద్దలను కలిసేందుకు ఆ పార్టీ ఎంపీ నిసిత్ ప్రమాణిక్తో కలిసి దిల్లీ వెళ్లారు.
ఇవీ చూడండి: