BUILDING COLLAPSED: విశాఖ నగరం కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. తాజాగా మరో వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గురువారం ఉదయం వెలికితీశారు. మృతుడు బిహార్‌కు చెందిన చోటు (27)గా అధికారులు గుర్తించారు.
నగరంలోని రామజోగిపేటలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అన్నాచెల్లి( అంజలి, దుర్గాప్రసాద్), బిహార్‌కు చెందిన చోటు అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో సాకేటి రామారావు, సాకేటి కల్యాణి, కొమ్మిశెట్టి శివశంకర, సాతిక రోజారాణి, సున్నపు కృష్ణ ఉన్నారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది వెలికి తీశారు.
"అర్ధరాత్రి ఓ పెద్ద శబ్ధం వచ్చింది. ఏంటా అని బయటికి వస్తే ఓ భవనం కూలిపోయింది. భవనంలో కొద్దిమంది అరుపులు విని అక్కడికి వెళ్లి.. ఇద్దరిని కాపాడాము. మిగతావాళ్లు వాటి కింద చిక్కుకున్నారు. ఇది సుమారు రెండు గంటల ప్రాంతంలో జరిగింది"-ప్రత్యక్షసాక్షి
భవనం ఒక్కసారిగా కూలడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో బిల్డింగ్‌లో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం పోలీసులు కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ సుమిత్ గరుడ పరిశీలించారు. గాయపడిన వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారించనున్నట్లు ఆర్డీవో హూస్సేన్ సాహెబ్ తెలిపారు.
"ఓ పాత భవనం కూలిపోవడం వల్ల ఐదు మందిని కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సహాయక బృందాలు వెలికితీస్తున్నాయి. ఇది మూడు అంతస్తుల భవనం. ఇందులో మొత్తంగా పది మంది ఉన్నట్లు తెలిసింది. రాత్రి 8 మంది ఉన్నారు. మిగిలిన ఇద్దరు బయటికి వెళ్లినట్లు సమాచారం."-హుస్సేన్ సాహెబ్, ఆర్డీవో
"ఓ భవనం కూలిపోయింది అన్న సమాచారం వచ్చింది. వారిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. వాళ్లందరికి గాయాలు అయ్యీయి. గాయపడిన వారికి అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఆ రిపోర్ట్స్‌ను బట్టి తర్వాత ఏం చేయాలి అనేది నిర్ణయిస్తాం"-అశోక్ కుమార్, కేజీహెచ్ సూపరింటెండెంట్
ఇవీ చదవండి: