Pond Accidents in Yadadri : యాదాద్రి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. యాదాద్రి గండి చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు తిరిగిరాని లోకాలకు వెళ్లగా... మరొకరు కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్య స్నానం చేస్తూ మూర్ఛతో మృతి చెందడం స్థానికంగా కలిచి వేసింది. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన ముగ్గురు భక్తులు ఇలా ప్రాణాలు వదలడంతో వారి స్వస్థలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: హైదరాబాద్‌లోని జగద్గిరి గుట్ట శ్రీనివాస్ నగర్‌కు చెందిన వరుసకు అన్నదమ్ములైన 19 సంవత్సరాల వయస్సు గల పవన్, 22 సంవత్సరాలు వయస్సు గల దండే కార్తిక్ శనివారం(ఈనెల 14న) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం కోసం బంధువులతో కలిసి యాదాద్రికి వచ్చారు. అనంతరం స్వామి వారి దర్శనానికి వెళ్తున్నాం అని చెప్పి ఇద్దరూ వారి వద్ద నుంచి బయలుదేరి వెళ్లారు. దర్శనానికని వెళ్లిన సోదరులిద్దరూ ఇంకా ఎంతసేపటికీ రాకపోవడంతో వారివెంట వచ్చిన బంధువు అయిన శ్రీకాంత్ ఇవాళ మధ్యాహ్నం యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో ఇవాళ(సోమవారం) సాయంత్రం గండి చెరువులో రెండు మృతదేహాలు తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని తేలియాడుతున్న మృతదేహాలను బయటకు తీసి బంధువులకు సమాచారం అందించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు దైవదర్శనానికి వచ్చి ఇలా మృత్యుఒడిలోకి చేరడంతో గుండెలవిసేలా విలపించిన ఘటన స్థానికులను కలచివేసింది. పుష్కరిణిలో స్నానం చేస్తుండగా మూర్ఛతో మృతి చెందిన వ్యక్తి నవాబుపేటకు చెందిన బోయిన రమేష్‌గా పోలీసులు గుర్తించారు.
రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో చెరువులో ఈతకు వెళ్లి చిన్న పిల్లలు అధిక సంఖ్యలో మరణిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు బావులు, ఈత కొలనులు, మంచి నీళ్ల చెరువులకు స్నానాలకు వెళ్లి ప్రాణాలు వదులుతున్నారు. పిల్లలపై పెద్దలు నిఘా ఉంచి ఈతకు, బయటకు వెళ్లినప్పుడు తగు జాగ్రత్త చర్యలు, సూచనలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: