ఫ్రాన్స్ నుంచి మరో మూడు రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం సాయంత్రం భారత్ చేరుకున్నాయి. ఫ్రాన్స్‌లోని ఇస్ట్రెస్ వైమానిక కేంద్రం నుంచి సుమారు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి నేరుగా ఇవి భారత్‌లో దిగినట్లు భారత వాయుసేన (ఐఏఎఫ్) వెల్లడించింది. మార్గమధ్యంలో యూఏఈ వైమానిక దళ ట్యాంకర్లు వీటిలో ఇంధనాన్ని నింపినట్లు పేర్కొంది. ఈ యుద్ధ విమానాల చేరికతో గగనతలంపై భారత వాయుసేన పోరాట సామర్థ్యం మరింత పెరగనున్నట్లు ఐఏఎఫ్ తెలిపింది.
"దేశ భద్రతకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పడానికి గర్విస్తున్నాను. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. మన వాయుసేనలో రఫేల్ చేరిక.. మొత్తం ప్రపంచం సహా భారత సార్వభౌమత్వానికి సవాలు విసురుతున్న పలు దేశాలకు కఠినమైన సందేశం. సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటి చేరిక కీలకమైంది"
-- రాజ్‌నాథ్ సింగ్ ,రక్షణ మంత్రి
రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తోంది. గగనతలంపై ఆధిపత్యం చెలాయించడం సహా లక్ష్యంపై కచ్చితత్వంతో దాడులు చేయడంలో రఫేల్ విమానాలు వాటికవే సాటి. భారత వాయుసేనను పటిష్ఠం చేయడంలో భాగంగా 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం విలువ రూ.59 వేల కోట్లు. రఫేల్ శ్రేణిలో తొలి అయిదు యుద్ధ విమానాలు గతేడాది జులై 29న భారత్‌కు చేరుకున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 36 రఫేల్ విమానాలు భారత్‌కు అందాల్సి ఉంది.
ఇదీ చదవండి: బుగాట్టి కార్, రఫేల్ మధ్య రేస్- గెలుపెవరిది?