కర్ణాటక బళ్లారిలోని హడగళికి చెందిన బసవ అలియాస్ హుచ్చా బాస్యా అనే యాచకుడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇతని అంతమ యాత్రకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఓ ప్రముఖ వ్యక్తి మరణిస్తే ఎలా అయితే వస్తారో.. అంతమంది వచ్చారు. ఇందుకు గల కారణం ఆయనతో ఆ పట్టణ వాసులకు ఉండే ప్రత్యేక అనుబంధమే. బసవకు భిక్షం పెడితే మంచి జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. అందుకే చాలా మంది పిలిచి మరీ అతనికి అన్నదానం చేసేవారు.
అయితే శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బాస్యా మృతి చెందాడు. ఆదివారం అతడి అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణంలో బ్యానర్లు కట్టి.. ఊరేగింపుగా పార్థివదేహాన్ని తీసుకెళ్లారు.
బాస్యా మరణ వార్త విన్న చాలా మంది ప్రజలు అతడితో ఉన్న అనుబంధాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తు చేసుకున్నారు. పలకరించిన వారందినీ బాస్యా.. అప్పాజీ (నాన్న) అని పిలిచే వాడని తెలిపారు. భిక్షం ఎత్తుకుని జీవనం సాగించే అతడు.. డబ్బులు ఎంత ఇచ్చినా రూ. 1 మాత్రమే తీసుకుని మిగతా సొమ్మును వెనక్కి ఇచ్చేవాడని పట్టణవాసులు తెలిపారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి దివంగత ఎం.పి. ప్రకాశ్, మాజీ మంత్రి పరమేశ్వర నాయక్ లాంటి రాజకీయ నాయకులందరితో ఎటువంటి బెరుకు లేకుండా మాట్లాడే వాడని స్థానికులు చెప్తున్నారు. బాస్యాతో మాట్లాడడాన్ని కూడా చాలా మంది అదృష్టంగా భావించేవారని, అందుకే అతడ్ని ఇలా గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: హాస్టళ్లలో 'అమ్మ' ప్రేమ.. విద్యార్థులకు నో పరేషాన్!