ప్రైడ్ మెట్రో స్టేషన్‌కు టీమ్ లీడర్‌గా హిజ్రా.. అది వారికే అంకితం - మహి గుప్తా హిజ్రా లేటెస్ట్ న్యూస్
ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో హిజ్రాలకు అంకితం ఇచ్చిన ఓ మెట్రో స్టేషన్‌కు హిజ్రానే టీమ్ లీడర్‌గా ఎంపికైంది. ఈ విజయం పట్ల పలువురు ఆమెను అభినందిస్తున్నారు.

కన్న వారే కాదన్నారు. సమాజం పట్టించుకోలేదు. అయినా వెనకడుగు వేయలేదు. సహించని వారే సలాం కొట్టేలా ఎదిగి.. తన లాంటి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది హిజ్రా మహీ గుప్తా. ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో హిజ్రాలకు అంకితం చేసిన ప్రైడ్ మెట్రో స్టేషన్‌కి టీమ్ లీడర్‌గా నిలిచింది మహీ. ఈ మెట్రోలో పనిచేసే వారంతా హిజ్రాలే. ఒకప్పుడు తనను ఊర్లోనుంచి వెళ్లగొట్టిన వారే ఇప్పుడు అభినందనలు తెలియజేస్తున్నారని మహీ గుప్తా తెలిపారు. ఈ విజయం వెనుక ఎన్నో ఏళ్ల కష్టం ఉందని మహీ వెల్లడించారు.
బిహార్ కటిహార్ జిల్లా సెమాపుర్ గ్రామానికి చెందిన మహీ గుప్తా.. ఓ హిజ్రా అని తెలియం వల్ల 2007లో ఇంటి నుంచి వెళ్లగొట్టారు. 2008 నుంచి పిల్లలకు ట్యూషన్స్ చెపుతూ.. వచ్చే డబ్బుతో చదవుకుంది. 2017లో మహీ కుటుంబసభ్యులు ఆమెను తిరిగి ఇంటికి ఆహ్వానించారు. 2019లో హిజ్రాలకు దిల్లీ ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని తెలుసుకుని.. ఎంతో కష్టపడి చదివింది. అనేక అవాంతరాలను ఎదుర్కొని ఉద్యోగం సాధించి.. టీమ్ లీడర్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం తాను సాధించిన ఈ విజయంపట్ల గ్రామం నుంచి వెళ్లగొట్టిన వారే.. ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతూ తనని కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు మహీ తెలిపింది.
'ఇతరుల నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినా.. వారెన్ని మాటలన్నా సరే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ధృడంగా ఉండండి. మీరు అనుకున్నది సాధించడంలో మీ నమ్మకమే మీకు మరింత బలానిస్తుంది. సమాజం నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు కొందరు తమ లక్ష్యాన్ని వదిలి పక్కదారి పడుతుంటారు. అటువంటి సమయాల్లోనూ ఆ మాటలను సానుకూలంగా తీసుకుని.. ఆశను కోల్పోకుండా ఉండాలి. జీవితంలో కష్ట సుఖాలు అన్నవి సర్వసాధారణం.. అవి కొద్దికాలమే ఉంటాయి.'
-- మహీ గుప్తా, నొయిడా మెట్రో స్టేషన్ టీమ్ లీడర్
నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్(ఎన్ఎంఆర్సీ) తన పరిధిలోని 50వ సెక్టారు స్టేషనుకు 'ప్రైడ్ స్టేషన్'గా పునఃనామకరణం చేస్తూ హిజ్రాల వర్గానికి అంకితం చేసింది. ఉత్తర భారత మెట్రో సర్వీసుల చరిత్రలో ఇదో విప్లవాత్మక నిర్ణయం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4.9 లక్షల హిజ్రాలు ఉన్నారు. వీరిలో జాతీయ రాజాధాని దిల్లీ పరిధిలో 35 వేల మంది ఉన్నారు. సమాజ ప్రగతిలో వీరిని కూడా భాగస్వాములుగా చేసి, ఓ అర్థవంతమైన స్థానాన్ని కల్పించాలనే లక్ష్యంతోనే ఎన్ఎంఆర్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది తెలిపారు.
