"ఈ ప్రపంచంలో అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో.. అక్రమ సంతానం మాత్రం ఉండరు. ఎందుకంటే తమ పుట్టుకలో పిల్లల పాత్ర ఏమీ ఉండదు" అని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వరంగ బెంగళూరు విద్యుత్తు సరఫరా కంపెనీ (బెస్కాం)లో గ్రేడ్-2 లైన్‌మన్‌గా పనిచేసే ఓ వ్యక్తి 2014లో మృతిచెందారు. ఆ ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలని మృతుడి రెండో భార్య కుమారుడు కె.సంతోష కోరారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే, రెండో వివాహం చేసుకోవడం చట్టవిరుద్ధమని.. అలాంటి పరిస్థితుల్లో రెండో భార్య సంతానానికి తండ్రి ఉద్యోగమివ్వడం తమ విధానాలకు విరుద్ధమని బెస్కాం స్పష్టం చేసింది. సంతోషకు ఉద్యోగం నిరాకరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
తొలుత ఏకసభ్య ధర్మాసనం సంతోష పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది. ఆ తీర్పును జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సంజీవ్‌కుమార్‌లతో కూడిన డివిజన్ ధర్మాసనం తాజాగా కొట్టివేసింది. "తల్లి, తండ్రి లేకుండా ఈ ప్రపంచంలో పిల్లలెవరూ పుట్టరు. తమ పుట్టుకలో వారి పాత్ర ఏమీ ఉండదు. కాబట్టి అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమోగానీ అక్రమ పిల్లలు ఉండరనే వాస్తవాన్ని చట్టం గుర్తించాలి. చట్టబద్ధ వివాహాల పరిధికి వెలుపల జన్మించే చిన్నారులకు రక్షణ ఎలా కల్పించాలన్నదాని గురించి పార్లమెంటు ఆలోచించాలి" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సంతోషకు ఉద్యోగమిచ్చే విషయాన్ని పరిశీలించాలని బెస్కాంను ఆదేశించింది.
ఇదీ చూడండి: 'బ్రిటిష్ హయాం నాటి రాజద్రోహ చట్టం ఇంకా అవసరమా?'
ఇదీ చూడండి: కొవిడ్ నిబంధనల ఉల్లంఘనపై కేంద్రం సీరియస్