Cabinet Expansion in Telangana : రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఒక్క ఖాళీ రేపో, ఎల్లుండో భర్తీ కానుంది. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిని కేబినెట్‌లోకి (Telangana Cabinet Expansion) తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలికి మహేందర్‌రెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నరు. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌కు ఉద్వాసన పలికినప్పటి నుంచి.. ఆ కేబినెట్‌లో ఒక స్థానం ఖాళీగా ఉంది.
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. తాండూరు టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని (Patnam Mahender Reddy) కేబినెట్‌లోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రేపు లేదా ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇచ్చే సమయాన్ని ఆధారంగా చేసుకొని విస్తరణ ముహూర్తం ఖరారు కానుంది.
ప్రస్తుతం వికారాబాద్ జిల్లా తాండూరులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి (Patnam Mahender Reddy) మధ్య గత కొంత కాలంగా కోల్డ్‌వార్ నడుస్తోంది. 2018లో తాండూరులో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డిపై.. కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. అనంతరం జరిగిన పరిణామాల వల్ల పైలట్ రోహిత్‌రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటినుంచి నియోజకవర్గంలో ఇరువురి నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
ఇదే విషయమై బీఆర్ఎస్ హైకమాండ్‌కు ఫిర్యాదులు అందాయి. అనంతరం వీరితో చర్చలు జరిపి అధిష్ఠానం బుజ్జగించింది. ఈ నేపథ్యంలోనే పట్నం మహేందర్‌రెడ్డికి.. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ పదవిని బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెట్టింది. దీంతో కొంతకాలం స్తబ్దుగా ఉన్నప్పటికి ఇటీవలే మరోసారి ఇరువురు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మరోవైపు టికెట్ మళ్లీ పైలట్ రోహిత్‌రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే వదంతులు వినిపించాయి.
ఇదే జరిగితే ఆయన భార్య వికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్ సునీత మహేందర్‌రెడ్డి కూడా పార్టీ మారి.. శాసనసభ లేదా లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈయన తమ్ముడు పట్నం నరేందర్‌రెడ్డి ప్రస్తుతం కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. తాండూరు టికెట్‌ను పైలట్ రోహిత్‌రెడ్డికి ఖరారు చేశారు. మరోవైపు కేబినేట్ విస్తరణలో మహేందర్‌రెడ్డికి చోటు కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యే టికెట్ రావడంపై పైలట్ రోహిత్‌రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహేందర్‌రెడ్డికి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని చెప్పారు. తాండూరు అభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిదని చెప్పారు. మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి వస్తున్నందుకు సంతోషంగా ఉందని వివరించారు. ఈ క్రమంలోనే పైలట్ రోహిత్‌రెడ్డి.. మహేందర్‌రెడ్డి కాళ్లు మొక్కి ఆశ్వీరాదం తీసుకున్నారు.
BRS MLAs Final Candidates List 2023 : బీఆర్ఎస్ గెలుపు గుర్రాలివే.. తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్!