Theft Gang Arrested In Madhya Pradesh : బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకుని బైక్‌పై వచ్చినవారిని టార్గెట్ చేస్తున్న దొంగల ముఠాలోని ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తమదైన శైలిలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దొంగల ముఠాలోని ఆరుగురికి మూడంతస్తుల ఇళ్లు ఉన్నట్లు తేలింది. వారందరూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు వెల్లడైంది. అలాగే దొంగతనం తర్వాత 25 వేల రూపాయలను పూజల కోసం దొంగల ముఠా వినియోగించేదని తేలింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
మౌగంజ్ జిల్లాలోని చౌహానా గ్రామానికి చెందిన రమేశ్ కుమార్ సోనీ అనే వ్యక్తి తన కుమార్తె వైద్యం కోసం యాక్సిస్ బ్యాంక్‌లో రూ.6 లక్షలు డ్రా చేసి బైక్ డిక్కీలో పెట్టాడు. ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో మందుల కోసం మెడికల్ షాపు వద్ద బైక్‌ను ఆపాడు. అరుణ్ కంజర్(30) అనే వ్యక్తి రమేశ్ కుమార్ బైక్ డిక్కీని పగలగొట్టి డబ్బుల్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన రమేశ్ కుమార్ స్థానికుల సహాయంతో నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అరుణ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద డిక్కీని పగలగొట్టేందుకు వాడే పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. రమేశ్ కుమార్ ఫిర్యాదు మేరకు అరుణ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో అరుణ్ కంజర్ కీలక విషయాలు బయటపెట్టాడు.
'బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకుని వచ్చేవారిని దొంగల ముఠా టార్గెట్ చేస్తోంది. ఈ ముఠాలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారు. గతేడాది ఆగస్ట్‌లో ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ బైక్ డిక్కీలో నుంచి నిందితులు రూ.4లక్షలు దోచుకున్నారు. ఎస్బీఐ బయట ఆర్మీ జవాన్ బైక్‌ను పార్క్ చేయగా అందులో నుంచి డబ్బులను కొట్టేశారు. ఇప్పటివరకు దొంగల ముఠా రూ.లక్షల్లో డబ్బులను దోచుకుంది. నిందితులు చాలా కాలంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. దొంగల ముఠాలో మిగిలినవారిని త్వరలో పట్టుకుంటాం ' అని మౌగంజ్ పోలీసులు తెలిపారు.
ముఠాలోని మిగతా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో నిందితుల విలాసవంతమైన ఇళ్లను చూసి ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ఆ ఇళ్లకు తాళాలు వేసి ఉండడం వల్ల వెనుదిరిగారు. దొంగతనం చేశాక ఆ సొమ్ములో రూ.25వేలను పూజల కోసం వినియోగించేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
కంటైనర్‌ని దోపిడీ చేసిన దొంగల ముఠా.. డ్రైవర్‌పై కత్తులతో దాడి