2020 ఫిబ్రవరి 29న దోహాలో తాలిబన్లతో అమెరికా చర్చలు జరిపింది. ఇందులో అఫ్గానిస్థాన్(Afghanistan latest news) ప్రభుత్వాన్ని భాగస్వామిని చేయలేదు. దీంతో ఆ సర్కారును ఖాతరు చేయాల్సిన అవసరం లేదనే సంకేతాన్ని తాలిబన్లకు ఇచ్చినట్లయింది.
అంతర్జాతీయ జిహాదీకి పాకిస్థాన్, సౌదీ అరేబియాతో కలిసి పునాది వేసింది అమెరికానేనని పలు దేశాల్లో దౌత్యవేత్తగా పని చేసిన తల్మిజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత అఫ్గాన్ పరిణామాలకు(Afghanista crisis) అగ్రరాజ్యానికి సరైన వ్యూహం, ప్రణాళిక లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. తాలిబన్లకు(Afghan Taliban) ఆయుధాలు సమకూర్చింది, శిక్షణ ఇచ్చింది పాకిస్థానే అని పేర్కొన్నారు. అఫ్గాన్ భవిష్యత్తుపై స్పష్టతకు మరికొంత సమయం పడుతుందన్నారు. అఫ్గాన్ పరిణామాల ప్రభావం భారత్‌పైౖ ఏమీ ఉండదని, అయితే మన విదేశీ విధానం పూర్తిగా అమెరికాపైన ఆధారపడి ఉందన్నారు. 1974 ఇండియన్ ఫారిన్ సర్వీసు బ్యాచ్‌కు చెందిన తల్మిజ్ అహ్మద్ సౌదీఅరేబియా, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యు.ఎ.ఇ)లో భారత రాయబారిగా పని చేశారు. దిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ వరల్డ్ అఫైర్స్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించిన ఈయన రిఫార్మ్స్ ఇన్ అరబ్ వరల్డ్, ఇస్లామిస్ట్ ఛాలెంజ్ ఇన్ వెస్ట్ ఏసియా పేరుతో రెండు పుస్తకాలు రాశారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు(Afghanistan Taliban) వశం చేసుకొన్న నేపథ్యంలో ఇందుకు దారితీసిన పరిస్థితులు, భవిష్యత్తు పరిణామాలపై 'ఈనాడు ప్రత్యేక ప్రతినిధి'కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
అఫ్గానిస్థాన్ ఈ దుస్థితికి రావడంలో అమెరికా పాత్ర ఎంత?
గ్లోబల్ జిహాదీకి బీజం వేసిందే పాకిస్థాన్, సౌదీ అరేబియాతో కలిసి అమెరికానే. ప్రపంచంలోనే హైపర్ పవర్ కలిగిన అమెరికా 30 సంవత్సరాల పాటు ఇరాక్, లిబియా లాంటి అనేక దేశాల్లో విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌లో. సోవియట్ పతనం తర్వాత బయటి దేశాల నుంచి అమెరికా ఉపసంహరించుకొన్నా, 9/11 తర్వాత తీవ్ర కోపంలో ఉన్న ఆ దేశం తాలిబన్లను ధ్వంసం చేసింది. అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కర్జాయ్‌ను తీసుకొచ్చి పెట్టింది. అయితే రెండు అంశాలను అమెరికా గుర్తించలేదు. తాలిబన్లపై దాడి చేసినప్పుడు ముఖ్య నేతలంతా పాకిస్థాన్ సహా తమకు అనువైన ప్రాంతాల్లో తలదాచుకోగా.. దిగువశ్రేణిలో ఎక్కువమంది అఫ్గానిస్థాన్‌లోని తమ గ్రామాలకు వెళ్లిపోయారు. స్థానికంగా వీరిపై చాలా దౌర్జన్యాలు జరిగాయి. వీరిలో తీవ్ర అసంతృప్తి పెరిగింది. మరోవైపు వివిధ ప్రాంతాల్లోని తాలిబన్ నాయకులు ఒక చోటుకు చేరడానికి ముషారఫ్ దోహదపడ్డారు. దీంతో మళ్లీ తాలిబన్లు పటిష్ఠం కావడం మొదలు పెట్టారు. అమెరికా సైన్యాన్ని వెనక్కు తెస్తామని 2007లోనే ఒబామా చెప్పారు. ఎక్కువ సైన్యాన్ని ఇస్తే ఒకే సారి నిర్మూలించి వస్తామన్న ఉన్నతాధికారుల సూచనతో అఫ్గానిస్థాన్‌లో సైన్యాన్ని 30వేల నుంచి లక్షకు పెంచారు ఒబామా. 2009-12 మధ్య 1,500 మంది అమెరికా సైనికులు మరణించారు. ఒబామా దిగిపోయేటప్పటికి అఫ్గాన్‌లో అమెరికా సైన్యం 8,500 మంది. చర్చల ద్వారా తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి ట్రంప్ ప్రయత్నించారు. 2020 దోహా సమావేశంలో టెర్రరిజాన్ని విస్తరించకూడదని, అల్‌ఖైదాకు స్థావరం కల్పించకూడదని, అమెరికాపై దాడులు చేయరాదని ఒప్పందం చేసుకున్నారు. హింసకు పాల్పడరాదని మాట్లాడలేదు. ఈ చర్చల్లో భాగంగా జైళ్లలోని కరడుగట్టిన నేరగాళ్లతో సహా ఐదువేల మందిని అఫ్గానిస్థాన్ విడుదల చేసింది. ఇందులో కొందరు ప్రస్తుతం తాలిబన్ నాయకత్వంలో పనిచేస్తున్నారు. బైడెన్ వచ్చిన తర్వాత సైన్యం ఉపసంహరణ గడువును సెప్టెంబరు 11 వరకు పెట్టారు. ఒకవైపు ఈ ప్రక్రియ జరుగుతుండగానే తాలిబన్లు ఆక్రమణలను మొదలుపెట్టారు. ఇది పూర్తిగా అమెరికా వైఫల్యమే. ప్రతి సంవత్సరం 110 బిలియన్ డాలర్లు ఇక్కడ అగ్రరాజ్యం ఖర్చు చేసింది.
తాలిబన్ల నాయకత్వంలో అఫ్గానిస్థాన్ పరిస్థితి ఏంటి?
తాలిబన్‌లో గతంలోలా కాకుండా ఇప్పుడు నాలుగైదు గ్రూపులున్నాయి. రాజకీయ ఆధిపత్య గ్రూపునకు బరాదర్ నాయకుడైతే, మిలిటెంట్ కమాండర్‌గా హక్కానీ ఉన్నారు. ఇతను హక్కానీ నెట్‌వర్క్‌కు నేతృత్వం వహిస్తున్నారు. చాలా క్రూరమైన గ్రూపు.క్షేత్రస్థాయిలో జరిగే వాటిపై వారికి నియంత్రణ ఉండదు. షరియా ప్రకారం పాలన అంటే ఏ షరియానో చూడాలి. సౌదీ అరేబియా, యు.ఎ.ఇ, టర్కీ, పాకిస్థాన్, మలేసియా ఇలా ఒక్కోచోట ఒక్కో రకంగా ఉంది. సౌదీలో వందేళ్ల పాటు మహిళలకు హక్కులుండేవి కాదు. రెండు,మూడేళ్లుగా ఇక్కడ మార్పు వచ్చింది. అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో కొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది.
పెద్ద ఎత్తున అఫ్గానిస్థాన్ సైన్యాన్ని తయారు చేశామని అమెరికా చెప్పింది కదా, తాలిబన్లకు వారెందుకు ఎదురు నిలవలేదు?
2015లోనే మూడున్నర లక్షల మంది అఫ్గానిస్థాన్ ఆర్మీని తయారు చేశామని ప్రకటించారు. ఇది వాస్తవం కాదు. చాలా మంది సైన్యంలో చేరింది కర్జాయ్‌ను నమ్మికాదు. ప్రాణాలిచ్చేందుకు సిద్ధమై కాదు.పేదరికం.. నిరుద్యోగంతో ఉపాధి కావాలని మాత్రమే. తాలిబన్లు ఇందుకు విరుద్ధం. వీరి చేతిలో 14వేల మంది అఫ్గానిస్థాన్ సైనికులు మరణించారు. అధ్యక్షుడే చేతులెత్తేసి పారిపోవడంతో ఉపాధి కోసం చేరిన వారు ప్రాణాలకు తెగించి ఎందుకు పోరాడతారు.
ప్రస్తుత పరిణామాలతో ప్రయోజనం పొందేవారేవరు?
అమెరికా ఇక చేయగలిగిందేమీ లేదు. దీంతో సంబంధం లేదు. పాకిస్థాన్, చైనా, రష్యా, ఇరాన్‌లు అఫ్గానిస్థాన్‌లో సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటాయి. చైనా, రష్యాలు గత ఐదేళ్లుగా ఓ పద్ధతి ప్రకారం పని చేస్తున్నాయి. రష్యా రాజకీయంగా పని చేస్తే, చైనా మౌలికవసతుల రంగంలో ఉంది. ఇక్కడి కాపర్, లిథియం, ఇతర ఖనిజాలపై చైనా దృష్టి పెట్టింది. రష్యా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చొరబడి ఉంది. అసలు తాలిబన్ ఏర్పాటుతో పాకిస్థాన్‌కు నేరుగా ప్రమేయం ఉంది. ఈ సంస్థ పుట్టిందే ఇక్కడ. వారికి శిక్షణ, ఆయుధాలు సమకూర్చిందీ ఈ దేశమే. 20 ఏళ్లుగా అన్ని రకాల సహాయం చేసింది. అయితే తాలిబన్ ఇప్పుడు పాకిస్థాన్ మీద ఆధారపడుతుందా లేక స్వతంత్రంగా పని చేస్తుందా అనేది చూడాలి. నిధుల పరంగా సహకరించేవి సౌదీ అరేబియా, యు.ఎ.ఇలు. ఇరాన్‌కు తాలిబన్ నాయకులతో మంచి సంబంధాలున్నాయి.
ఇందులో పాకిస్థాన్ పాత్ర ఏమిటి?
పాకిస్థాన్‌ది రెండునాల్కల ధోరణి. అంతర్జాతీయ జిహాదీని సృష్టించడంలో సౌదీ అరేబియా, అమెరికాతో కలిసి ప్రధాన పాత్ర పోషించింది. 9/11 తర్వాత అమెరికా తీవ్ర హెచ్చరికలతో టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉన్నట్లు నటిస్తూ తాలిబన్లకు నేరుగా అన్ని రకాల సాయం చేసింది. ఈ విషయం అమెరికాకూ తెలుసు. అంతర్జాతీయ జిహాదీపై ఐ.ఎస్.ఐదే పూర్తి ఆధిపత్యం. అమెరికాకు చెందిన సి.ఐ.ఎ లేదా సౌదీ అరేబియా నిఘా వర్గాలకు నేరుగా సంబంధాలుండేవి కావు. ఈ కారణంగానే కింద ఏం జరుగుతుందో తెలిసేది కాదు. 9/11 తర్వాత అమెరికా అఫ్గానిస్థాన్‌పై దాడి చేసి తాలిబన్లను అణచివేస్తే, ప్రపంచంలో అక్కడక్కడా ఉన్న తాలిబన్లను ఒక చోట చేర్చి పటిష్ఠం చేసింది కూడా పాకిస్థానే. ఇవన్నీ అగ్రరాజ్యానికి తెలుసు. 2006 నాటికి తాలిబన్లు బలమైన శక్తిగా రూపుదిద్దుకోవడానికి పాకిస్థాన్ పూర్తిగా సాయపడింది. అఫ్గానిస్థాన్ నుంచి వెళ్లిపోవాలనే తాపత్రయంలో అమెరికా ఉంటే, పాకిస్థాన్‌తో కలిసి ప్రభుత్వ బలగాలపై తాలిబన్లు పెద్ద ఎత్తున దాడులు చేశారు. వాస్తవానికి ఒబామా అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే ముందు అఫ్గానిస్థాన్‌లో పర్యటించాడు. అప్పుడే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆయనకు అర్థమైంది. తాలిబన్లంతా పాకిస్థాన్‌లో ఉంటే మనం అఫ్గానిస్థాన్‌లో ఏం చేద్దామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిని బట్టే తాలిబన్ల పటిష్ఠతలో పాకిస్థాన్ పాత్ర ఏమిటో స్పష్టమవుతుంది.
భారత దేశంపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది?
ఈ విషయాన్ని మనం విశాల దృక్పథంతో చూడాలి. అఫ్గానిస్థాన్‌లో మనకు నేరుగా రాజకీయ, మిలటరీ ప్రమేయం లేదు. మనం అక్కడ అభివృద్ధి పనులపై మాత్రమే దృష్టి పెట్టాం. చాలా పెట్టుబడులు పెట్టాం. ప్రాజెక్టులు, పార్లమెంటు భవనంతో సహా పలు నిర్మాణాలు చేపట్టాం. ప్రస్తుతానికి వ్యూహాత్మకంగా అక్కడి పరిణామాలను పరిశీలించడమే. అఫ్గానిస్థాన్ బయట తాలిబన్లు పెద్దగా ఎలాంటి కార్యకలాపాలు చేయలేదు. కాబట్టి కశ్మీర్‌లో ఏదో చేస్తారని అనడం సరికాదు. కశ్మీర్‌లో జిహాదీని పెంచి పోషించింది ఐఎస్‌ఐ ప్రత్యక్ష ప్రమేయంతో పాకిస్థానే. తాలిబన్లు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సమస్య పాకిస్థాన్, చైనా, రష్యాలకే. అయితే భారతదేశానికి సరైన వ్యూహం కానీ, దృక్పథం కానీ లేదనిపిస్తోంది. మన విదేశీ విధానం అమెరికా మీద ఆధారపడి ఉంది.
ఇదీ చూడండి: kabul airport blast: 'అఫ్గాన్‌లో పరిస్థితులు ఆందోళనకరం'
కాబుల్ పేలుళ్లకు తాలిబన్ల సాయం! ఆ రెండు చెక్‌పోస్టులు దాటించి...