Kanneganti Hanumanthu: పల్నాడుగా ప్రసిద్ధి చెందిన గురజాల, మాచర్ల, వినుకొండ, నరసరావుపేట ప్రాంతాలు బ్రిటిషర్ల కాలం నుంచే కరవుకాటకాలకు నిలయాలుగా ఉండేవి. వర్షాలు లేక రైతులు, రైతుకూలీలు అవస్థలు పడేవారు. దిగుబడులు వచ్చినా, రాకున్నా శిస్తులు చెల్లించాల్సి వచ్చేది. పశువుల పోషణకు ప్రజలంతా అడవులపై ఆధారపడేవారు. ఇందుకోసం ఏడాదికి రూ.2 పుల్లరి చెల్లించాల్సి వచ్చేది. ఇవి చాలవన్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చిన అటవీచట్టంతో అధికశాతం అడవులు రిజర్వు ప్రాంతాల కేటగిరీలోకి చేర్చారు. నాటి నుంచి గ్రామాధికారుల ఆగడాలు మితిమీరాయి. అలాంటి సమయంలో దుర్గి మండలం కోలగట్ల శివారులోని మించాలపాడులో 1870లో కన్నెగంటి అచ్చమ్మ, వెంకటప్పయ్య దంపతులకు హనుమంతు జన్మించారు. వారిది మోతుబరి కుటుంబం. గ్రామాధికారుల ఆగడాలను చూస్తూ పెరిగిన హనుమంతు... ప్రజల జీవన పరిస్థితులను మార్చడానికి ఆరాటపడేవారు. ఊరందరి అవసరాలను తీర్చేవారు. కలకత్తాలో 1920 సెప్టెంబరులో గాంధీజీ ఇచ్చిన సహాయ నిరాకరణ పిలుపును పల్నాడు ప్రాంతం అందిపుచ్చుకుంది. 1921 కల్లా అది ఉద్ధృతమైంది.
మించాలపాడు కేంద్రంగా హనుమంతు సారథ్యంలో పూర్తి అహింసా విధానంలో ప్రజలు చేస్తున్న ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సహించలేని బ్రిటిష్ సైనికులు జంగమహేశ్వరపు రామాపురంలో పన్నులు చెల్లించడంలేదని 18 మంది రైతులకు బేడీలు వేసి ఊరేగిస్తూ తీసుకెళ్లారు. ప్రజలు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేశారు. స్థానిక జమీందారులు, ఆంగ్లేయ అధికారులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా హనుమంతు లొంగకపోవడంతో 1922లో మద్రాసు నుంచి ప్రత్యేక కలెక్టర్‌గా రూథర్‌ఫర్డ్‌ను పంపించారు. ఆయన సారథ్యంలో బ్రిటిష్ సైనికులు గుర్రాలపై ఒక్కో గ్రామానికి చేరుకుంటూ విధ్వంసం సృష్టించినా ఫలితం కనిపించలేదు. దాంతో హనుమంతును ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారు.
జమీను ఇస్తాం... జమీందారును చేస్తాం: "దుర్గి ప్రాంతంలోని చుట్టుపక్కల 45 గ్రామాలను కలిపి ఎస్టేట్‌గా మారుస్తాం. నిన్నే జమీందారును చేస్తాం. ప్రజలపై ఎన్ని పన్నులైనా వేసుకో. మాకు నామమాత్రంగా చెల్లిస్తే చాలు. ఇప్పటికిప్పుడు నీ దగ్గర ఎంతుంటే అంత మొత్తాన్ని మాకు పన్నుగా చెల్లించు" అని ఆ మహావీరుడికి ఆంగ్లేయులు ఆశపెట్టారు. నా ఒక్కడి ప్రయోజనాల కోసం ప్రజలను బలిపశువులను చేయలేనని, వారిని రాబందులకు అప్పజెప్పబోనంటూ ఆయన స్పష్టంచేశారు.
వీరుడి రొమ్ము చీల్చిన తూటాలు: హనుమంతును హతమార్చడం ద్వారానే ఉద్యమాన్ని ఆపవచ్చని రూథర్‌ఫర్డ్ పన్నాగం పన్నాడు. అప్పటికే చౌరాచౌరీ ఘటనతో గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు. మహాత్ముడి ఆదేశానుసారం నడచుకోవాలని హనుమంతు సైతం నిర్ణయించుకున్న సమయంలోనే గ్రామంలో 1922 ఫిబ్రవరి 22న కలకలం రేగింది. పుల్లరి చెల్లించకుంటే ఊరిలోని పశువులన్నిటినీ తోలుకెళతామని ఆంగ్లేయ పోలీసుల నుంచి కబురు అందింది. రైతులు అడ్డుకోగా వారిపై దాడి చేశారు. విషయం తెలిసి, ప్రజలందరి పన్నును తానే చెల్లిస్తానంటూ కేకలు వేస్తూ పరుగున వస్తున్న హనుమంతుపై పోలీసులు 26సార్లు కాల్పులు జరిపారు. దాంతో ఆయన కుప్పకూలారు. ఆయన దాహం తీర్చడానికి భార్య గంగమ్మ తీసుకొచ్చిన నీటికుండను సైతం పోలీసులు పగులగొట్టారు. చివరికి వందేమాతరం అంటూ నినదిస్తూనే కన్నెగంటి హనుమంతు అదేరోజు రాత్రి కన్నుమూశారు. అమరుడిగా ఇప్పటికీ ప్రజల మనసులో జీవించే ఉన్నారు.
ఇదీ చదవండి: క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం