జమ్ముకశ్మీర్ నగ్రోటాలో గురువారం తెల్లవారు జామున ఉగ్రవాదులు, బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు జైషే మహమ్మద్ సంస్థ ముష్కరులు హతమయ్యారు. నగరంలోని బాన్ టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌పై కీలక విషయాలు వెల్లడించారు జమ్ము జోన్ ఐజీ ముకేశ్ సింగ్.
కశ్మీర్లో భారీస్థాయిలో దాడులు చేపట్టాలనే లక్ష్యంతోనే జైషే మహమ్మద్ ఉగ్రవాదులు భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో దేశంలోకి చొరబడినట్లు కనిపిస్తోందన్నారు ఐజీ. ట్రక్కులో వస్తోన్న ఉగ్రవాదులను అడ్డగించగా కాల్పులకు పాల్పడినట్లు తెలిపారు.
"సాధారణ తనిఖీల్లో భాగంగా ఉదయం 5 గంటల ప్రాంతంలో ఓ ట్రక్కు కనిపించింది. దానిని అడ్డగించగా డ్రైవర్ ట్రక్కును వదిలి పారిపోయాడు. ఈ తనిఖీల్లో సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులపై భారీ ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. గ్రెనేడ్లు కూడా ప్రయోగించారు. ఈ క్రమంలో మరింత మంది బలగాలను ఘటనా స్థలానికి పంపాం. ఎన్కౌంటర్ సుమారు 3 గంటల పాటు కొనసాగింది. భారీ స్థాయిలో దాడులు చేయాలనే ప్రణాళికతోనే దేశంలోకి చొరబడినట్లు కనిపిస్తోంది. వారు కశ్మీర్ లోయ వైపునకు వెళ్తున్నారు. వారు డీడీసీ ఎన్నికలను లక్ష్యాంగా చేసుకుని భారీ దాడికి ప్రణాళిక చేసినట్లు తెలుస్తోంది. మా ఆపరేషన్ కొనసాగుతోంది. పారిపోయిన ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నాం. "
- ముకేశ్ సింగ్, ఐడీ, జమ్ము జోన్
ఈ ఎన్కౌంటర్లో నలుగురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. 11 ఏకే-47 తుపాకులు, 4 పిస్టళ్లు, 29 గ్రెనేడ్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. ఘటనా స్థలనానికి సమీపంలో ఉన్న జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు పోలీసులు. నగ్రోటా చెక్‌పోస్ట్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇదీ చూడండి: చైనా ఉలిక్కిపడేలా మలబార్ విన్యాసాలు