దేశంలోని ప్రజలందరికీ కరోనా టీకా అందిస్తామని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. వాస్తవిక సమాచారం ఆధారంగానే ఇలాంటి అంశాలపై చర్చించడం ముఖ్యమని అన్నారు.
ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడమే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. భారీ స్థాయిలో ప్రజలకు వ్యాక్సిన్ను ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. దేశంలోని ప్రజలందరికీ టీకా అందించాల్సిన అవసరం లేదని తెలిపారు. టీకా సమర్థత ఆధారంగా వ్యాక్సినేషన్ ఆధారపడి ఉంటుందని అన్నారు.
కొవిషీల్డ్ దుష్ప్రభావంపై..
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న కొవిషీల్డ్ మానవ ట్రయల్స్ వల్ల దుష్ప్రభావాలు తలెత్తాయన్న కథనాలపై రాజేశ్ స్పందించారు. ట్రయల్స్ నిలిపివేసే విధంగా ప్రాథమిక దర్యాప్తులో ఎలాంటి అంశాలు బయటపడలేదని తెలిపారు. టీకా ప్రయోగాలపై 'సమాచార భద్రత పర్యవేక్షణ బోర్డు' రోజువారీ పర్యవేక్షణ చేపడుతోందని తెలిపారు. ప్రతికూల ప్రభావాలు తలెత్తితే గుర్తించి, నివేదిక అందిస్తుందని అన్నారు.
క్లినికల్ ట్రయల్స్ వల్ల తలెత్తే దుష్ప్రభావాల గురించి వలంటీర్లకు ముందుగానే సమాచారం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ ప్రతికూల ప్రభావాలు వ్యాక్సిన్ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికపై ఏ విధంగానూ ప్రభావం చూపవని స్పష్టం చేశారు.
దేశంలో కరోనా ఇలా..
మరోవైపు, దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ రేటు గతవారం 3.72 శాతంగా నమోదైందని తెలిపారు రాజేశ్. మొత్తంగా నవంబర్ 11 నుంచి డిసెంబర్ 1 మధ్య పాజిటివ్ రేటు 7.15 శాతం నుంచి 6.69 శాతానికి తగ్గిందని తెలిపారు. నవంబర్లో కరోనా కేసుల కన్నా రికవరీలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అన్ని పెద్ద దేశాలతో పోలిస్తే భారత్లో పది లక్షల జనాభాకు నమోదైన కేసుల సంఖ్య అతి తక్కువ(211)గా ఉందని స్పష్టం చేశారు. గత ఏడు రోజుల సరళిని పరిశీలిస్తే ఐరోపా దేశాలలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు.