దిల్లీలో పొగమంచుతో పాట కాలుష్యం కమ్మేయడం వల్ల జనాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారం రోజుల నుంచి దిల్లీలో 6 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ దట్టమైన పొగమంచు కమ్మేయడం వల్ల 267 రైళ్లు 5 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం వల్ల 5 విమానాలను దారి మళ్లించామని.. 30 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఇందిరాగాంధీ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
హిమాచల్ కంటే దిల్లీలోనే అధికంగా పొగమంచు, చలితీవ్రత ఉన్నాయి. దిల్లీలో 2013 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇది రెండోసారని గత రెండు సంవత్సరాలలో ఇవే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలని వాతావరణ అధికారులు తెలిపారు. ప్రజలు తమ వాహనాలపై ఫాగ్‌ల్యాంప్‌లను ఉపయోగించడంతో పాట నెమ్మదిగా నడపాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాగే దట్టమైన పొగమంచుకు ఎక్కువ కాలం ఉన్నట్లయితే ఆస్తమాతో పాట ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఉన్నవారికి శ్వాసకోశ సమస్యలు తలెత్తె అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. చలి తీవ్రత అధికంగా ఉండటంతో దిల్లీలోని పాఠశాలలకు ఈ నెల 15 వరకు సెలవులను పొడగించినట్ల దిల్లీ ప్రభుత్వం తెలిపింది.
ఉత్తర భారతదేశంలో తీవ్ర చలిగాలులు వీస్తుండటంతో భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణ, చండీగఢ్, ఉత్తరాఖండ్‌లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పంజాబ్, హరియాణ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లోచలిగాలులు వీస్తున్నాయని ఐఎమ్‌డీ తెలిపింది. బిహార్‌లోని గయ నగరంలో మంగళవారం ఉష్ణోగ్రత 3.7డిగ్రీల సెల్షియస్ కు తగ్గింది. దిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణ, బిహార్ రాష్ట్రాల్లో తీవ్ర పొగమంచు కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పొగమంచు కారణంగా ఉత్తర రైల్వే ప్రాంతంలో 36 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.