సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడిన నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీకి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అనుమతి రద్దు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాల సమావేశంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఈ విషయం వెల్లడించారు. ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై కారణాలపై సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ చర్చించారు.
కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు తప్పుడు అడ్వర్టయిమెంట్లను నియంత్రించేందుకు త్వరలో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఎక్కువ సమయం తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందని సమావేశంలో పలువురు తెలిపారు. ఇంటర్ బోర్డు నిర్ణయించిన ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకే తరగతులు నిర్వహించాలని నవీన్ మిత్తల్ స్పష్టం చేశారు. అదనపు వేళల్లో తరగతులు నిర్వహించే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి బయోమెట్రిక్ హాజరు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఒక చోట అనుమతి పొంది మరో చోట కాలేజీ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాలేజీల్లోని కౌన్సిలర్లు విద్యార్థులకు నిరంతరం తగిన సూచనలు ఇవ్వాలని అధికారులు తెలిపారు. సాత్విక్ ఆత్మహత్య నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరవుతారని 14 ప్రముఖ కాలేజీలకు ఇంటర్ బోర్డు నిన్న సమాచారం ఇచ్చింది. ఈ రోజు సమావేశానికి మంత్రి గైర్హాజరు కావడం పట్ల కాలేజీ యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
నార్సింగి శ్రీచైతన్య కళాశాలలోని తరగతి గదిలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. మృతుని వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలువడ్డాయి. కళాశాల వేధింపుల వల్లే విద్యార్థి చనిపోయాడని తేలింది. సాత్విక్‌ను అసభ్యకరంగా తిట్టడం వల్లే మనస్తాపం చెంది.. ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. తోటి విద్యార్థుల ముందు కొట్టడం వల్లే మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. రీ చైతన్య కళాశాల అడ్మిన్ ప్రిన్సిపల్ నర్సింహాచారి అలియాస్ ఆచారి, కృష్ణారెడ్డి రోజూ స్వాతిక్ను తిట్టడంతో మానసికంగా కుంగిపోయాడని పోలీసుల విచారణలో తేలింది.
సాత్విక్ చనిపోయే రోజు తల్లిదండ్రులు వచ్చి వెళ్లగానే.. సాత్విక్‌ను ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి చితక బాదినట్లు తెలుస్తోంది. ఆచారి, కృష్ణారెడ్డి సాత్విక్ ఇంట్లో వారిని బూతులు తిట్టారని పోలీసులు తెలిపారు. మరోవైపు హాస్టల్‌లో సాత్విక్‌ను వార్డెన్ వేధింపులకు గురి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: