Telangana Assembly Election Results 2023 Live Updates : తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని వ్యాఖ్యలు చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. గతంలో నష్టపోతామని తెలిసినా తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్, అనైక్యత, నాయకత్వ లోపం కారణంగా సరైన సీట్లు సాధించడంలో విఫలమైంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడే ప్రశ్నార్థకం అయ్యింది. అప్పటికే పీసీసీలుగా ఉన్న వారిని మార్చినా పార్టీలో పెద్ద మార్పులేమీ రాలేదు. ఆ తర్వాత జరిగిన హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓటమి పాలైంది. వీటితో పాటు మునుగోడు, హుజూరాబాద్‌లలో కూడా ఆ పార్టీకి చుక్కెదురైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కానీ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత క్రమంగా పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కదలిక వచ్చింది. వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీలో ఊపు తీసుకొచ్చారు. ముఖ్యంగా రేవంత్ దూకుడు నాయకుల్లో కొత్త ఉత్సాహం తెచ్చిందనడంలో సందేహమే లేదు. రేవంత్ అధికారం చేపట్టే సమయానికి రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ల మధ్యే తీవ్ర పోటీ ఉంది. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆ పార్టీ మార్చడం, బీఆర్ఎస్, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందన్న అనుమానాలను కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఈ క్రమంలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవ్వడం, కాంగ్రెస్ ఊహించని విధంగా గెలుపొందడం ఆ పార్టీకి దక్షిణ భారతంలో కాస్త ఊరట లభించింది.
కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా- ఎన్నికల విజయంపై రేవంత్ ట్వీట్
ఇదే వ్యూహాన్ని పొరుగున ఉన్న తెలంగాణలోనూ అవలంభించాలని భావించిన కాంగ్రెస్ పార్టీ అందుకు తగిన విధంగా వ్యూహాలు రచించడం మెుదలుపెట్టింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులపై విమర్శలను ఎక్కుపెట్టింది. ఎమ్మెల్సీ కవితపై వచ్చిన లిక్కర్ ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శించి బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్న విషయాన్ని బల్ల గుద్ది చెప్పింది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలపై వచ్చిన వ్యతిరేకత ముఖ్యంగా దళిత బంధు లాంటి పథకాలను ఎమ్మెల్యేలు కమీషన్లుగా మార్చుకుంటున్నారని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. అవినీతి, కుటుంబ పాలన అంశాలను కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది.
అంతేకాకుండా గత పదేళ్లుగా నాయకులు, మంత్రులపై వస్తున్న వ్యతిరేకతను స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైంది. ముఖ్యంగా నిరుద్యోగుల పక్షాన నిలిచి కాంగ్రెస్ ప్రకటించిన ప్రధాన హామీల్లో వారికి బాసటగా నిలవటం ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. వీటితో పాటు అగ్ర నేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో తరుచూ పర్యటించి నాయకులను ఉత్సాహపరచడం, నేతల మధ్య ఐక్యత పెంపొందించేలా దిశానిర్దేశం చేయటం పార్టీకి బాగా అనుకూలమైంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్పై వ్యతిరేకంగా ఉన్న నాయకులను పార్టీలోకి చేర్చుకోవడంలోనూ నాయకులు మనస్పర్థలు పక్కన పెట్టి మరీ పని చేశారు. ఇలా ఎవరికి వారే పార్టీ కోసం కృషి చేశారు.
కాంగ్రెస్ ఇంతలా బలపడటానికి మరో కారణం ఆ నాయకులంతా ఏకతాటిపైకి రావడమే అని చెప్పుకోవాలి. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం విజయం సాధించింది. కాంగ్రెస్ అంటే పదవుల కోసం కాదు, ప్రజలకు మంచి పాలన అందించే పార్టీగా తీర్చిదిద్దాలని చేసిన ప్రయత్నాలు కర్ణాటకతో స్పష్టమయ్యాయి. రాజస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలు కర్ణాటకలోనూ రిపీట్ అవుతాయని అంతా అనుకున్నారు. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. ఎన్నడూ లేనంతగా నాయకులు సైలెంట్‌గా వ్యవహరిస్తూ అధిష్ఠానం మాటకు కట్టుబడి ఉంటూ ఎన్నికల్లో పని చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ విపరీతంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయడం, మేనిఫెస్టో హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సఫలీకృతమయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధమైనా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. వీటినే బీఆర్ఎస్, బీజేపీ అస్త్రాలుగా మలుచుకుంది. అయినా కాంగ్రెస్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. సంయమనం పాటిస్తూ అధిష్ఠానం చెప్పిన విధంగా ముందుకు సాగుతూ ప్రజల్లోకి వెళ్లింది. ఈ మార్పును ప్రజలు కూడా గుర్తించారు. ఒకప్పుడు కాదు ఇప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పిన కాంగ్రెస్ నాయకుల మాటలను ప్రజలు నమ్మారు. అభ్యర్థుల ఎంపిక, సరికొత్త ప్రచారం, అధికార పార్టీ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం, ఐక్యంగా ముందుకు సాగటం వంటి అంశాలతో ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. 64 సీట్లతో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకుంది.