Teesta Setalvad Supreme Court : గుజరాత్ అల్లర్ల కేసులో కల్పిత సాక్ష్యాలు సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వెంటనే లొంగిపోవాలని గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టేసిన ధర్మాసనం.. ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.
Teesta Setalvad Gets Bail : గోద్రా అనంతరం జరిగిన అల్లర్ల కేసులో కల్పిత సాక్ష్యాలు సృష్టించారనే కేసులో.. గుజరాత్ హైకోర్టు బెయిల్ తిరస్కరించడం వల్ల తీస్తా సెతల్వాడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అభియోగపత్రం దాఖలు చేసిన తర్వాత కస్టోడియల్ విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. సాక్ష్యులను ప్రభావితం చేయొద్దని.. సెతల్వాడ్‌కు సుప్రీం కోర్టు సూచించింది. ఒకవేళ సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగితే తమను నేరుగా సంప్రదించవచ్చని గుజరాత్ పోలీసులకు అనుమతి ఇచ్చింది. విచారణాధికారులపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం.. 2022 వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది.
'తీస్తా సెతల్వాడ్ ఇప్పటికే తన పాస్‌పోర్టును సమర్పించారు. అది సెషన్స్ కోర్టు కస్టడీలో ఉంటుంది. ఈ కేసులో సాక్ష్యులకు ఆమె దూరంగా ఉండాలి. ఒకవేళ సాక్ష్యులను ఆమె ప్రభావితం చేస్తున్నట్లు తేలితే గుజరాత్ పోలీసులు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించొచ్చు' అని బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
Gujarat Riots Teesta Setalvad : గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై తీస్తా సెతల్వాడ్‌పై గతంలో కేసు నమోదైంది. అమాయకులను కేసులో ఇరికించేందుకు కుట్రపన్నారంటూ ఆమెపై పోలీసులు అభియోగాలు మోపారు. ఆ కేసులో భాగంగా గతేడాది జూన్‌లో గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) ముంబయిలో తీస్తాను కస్టడీలోకి తీసుకుంది. ఆ తర్వాత ఆమె రెండు నెలల పాటు జైల్లో ఉన్నారు. తనకు బెయిల్ నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తీస్తా సెతల్వాడ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాజాగా సాధారణ బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.