నూతన విద్యా విధానం కింద సాంకేతిక కోర్సులను ప్రాంతీయ భాషల్లో బోధించనున్నారు. ఇందుకోసం సబ్జెక్టులను ఆయా భాషల్లోకి అనువదించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని అఖిల భారత విద్యా సాంకేతిక మండలి(ఏఐసీటీఈ) మంగళవారం తెలిపింది. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థల అధికారులతో జరిగిన ఓ వర్చువల్ సమావేశంలో ఏఐసీటీఈ ఛైర్మన్ అనిల్ సహస్రబుద్ధే పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచే దేశంలోని సాంకేతిక విద్యాసంస్థల్లో ఈ విద్యాబోధన అమల్లోకి వస్తుందని చెప్పారు.
"కృత్రిమ మేధ సాయంతో సిలబస్‌ను అనువదిస్తున్నాం. ఇప్పటికే.. తెలుగు, తమిళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో పుస్తకాలను అనువదించాం. త్వరలో ప్రచురణ ప్రారంభిస్తాం. ఒడియా, అస్సామీ, మలయాళం భాషల్లోకి సిలబస్‌ను అనువదించే ప్రక్రియ జరుగుతోంది. ప్రాంతీయ భాషల్లోకి సబ్జెక్టులను అనువదించే ప్రక్రియ మూడేళ్లుగా సాగుతోంది. అయితే.. నూతన విద్యా విధానం ద్వారా ఈ ప్రక్రియ ఊపందుకుంది. పెద్దపెద్ద విద్యా సంస్థలకు చెందిన వైస్ ఛాన్సలర్లు ఇందుకోసం తమవంతు సహకారాన్ని అందించారు."
-అనిల్ సహస్రబుద్ధే, ఏఐసీటీఈ ఛైర్మన్.
ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులకు ప్రాంతీయ భాషల్లో చదువుకునే అవకాశం లభించనుందని సహస్రబుద్ధే స్పష్టం చేశారు. మహమ్మారి విజృంభణ సమయంలోనూ సాంకేతికత సాయంతో సిలబస్ అనువాద ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుత కరోనా కాలంలో సామాజిక దూరం అనే పదానికి బదులుగా.. 'భౌతిక దూరం' అనే పదాన్ని వినియోగించాలని ఆయన పేర్కొన్నారు. భౌతిక దూరం పాటిస్తూనే తోటివారికి సాయపడాలని కోరారు.
ఇదీ చూడండి: Covid: మూడో దశ సన్నద్ధతపై మోదీ సమీక్ష
ఇదీ చూడండి: Petrol Hike: 'జూన్ 11న దేశవ్యాప్తంగా నిరసనలు'