teacher in the name dead brother: మరణించిన తన సోదరుడి ధ్రువపత్రాలతో 24 ఏళ్లుగా ప్రభుత్వ టీచర్ ఉద్యోగంలో కొనసాగిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. లక్ష్మణె గౌడ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. నిందితుడికి న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కర్ణాటకలోని మైసూరులో ఈ ఘటన జరిగింది.
మైసూర్ జిల్లా కేఆర్ నగర్ తాలుకాలోని హెబ్బలు గ్రామంలో లక్ష్మణె గౌడ నివసించేవాడు.1994-95లో లక్ష్మణె గౌడ అన్నయ్య లోకేశ్ గౌడ.. ప్రభుత్వ టీచర్‌గా ఎంపికయ్యాడు. అయితే, ఉద్యోగంలో చేరకముందే చనిపోయాడు. అదేసమయంలో, అన్నయ్య ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని భావించిన లక్ష్మణె గౌడ.. సోదరుడి పేరుతో అపాయింట్మెట్ లెటర్ తయారు చేయించాడు. లోకేశ్ గౌడ పేరుతో ప్రభుత్వ స్కూల్లో చేరాడు. 24 ఏళ్ల పాటు జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేశాడు.
ఎప్పుడో ఫిర్యాదు చేస్తే....: హునసురుకు చెందిన ఇన్‌టెక్ రాజు అనే సామాజిక కార్యకర్తకు లక్ష్మణె గౌడ విషయం తెలిసింది. అనుమానంతో వివరాలు ఆరా తీసి.. 2019లో విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు జరపాలని తహసీల్దార్‌కు ఆదేశాలు అందాయి. అయితే, లక్ష్మణె గౌడ కుటుంబ సభ్యులు ఎలాంటి వివరాలు అందించడం లేదని తహసీల్దార్.. ఉన్నతాధికారులకు నివేదించారు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్.. సామాజిక కార్యకర్త రాజుకు సూచించారు. అయితే, ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్.. జిల్లా కలెక్టర్ ఆదేశాలను పాటించడం లేదని లోకాయుక్తలో రాజు ఫిర్యాదు చేశారు. 2020లో ఈ కేసు నమోదైంది. లోకాయుక్త అధికారులు నిందితుడిని పిలిచి విచారణ జరిపారు. రిక్రూటింగ్ అధికారుల సమక్షంలోనూ వాదనలు జరిగాయి. సరైన ధ్రువపత్రాలు సమర్పించని లక్ష్మణె గౌడపై మార్చి 21న పరియపట్నం పోలీసులు కొత్త కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
ఇదీ చదవండి: మూడో భార్యతో కలిసి రెండో భార్య హత్య.. పెట్రోల్ పోసి నిప్పంటించి..