TDP Rally in Guntur: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం శ్రేణులు పోలీస్ ఆంక్షలు ఛేదించి శాంతిర్యాలీ నిర్వహించారు. ఖాకీల నిర్బంధకాండకు ఎదురొడ్డి.. నిరసన యాత్ర నిర్వహించారు. ముందుగా ప్రకటించినట్లే.. లాడ్జి సెంటర్ నుంచి హిమని సర్కిల్ గాంధీ విగ్రహం వరకూ ర్యాలీగా వెళ్లి గాంధీజీకి నివాళి అర్పించారు. జనసేన, సీపీఐ కూడా శాంతిర్యాలీలో భాగమయ్యాయి.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. గుంటూరులో తెలుగుదేశం తలపెట్టిన శాంతిర్యాలీపై పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినా.. పార్టీ శ్రేణులు పట్టుదలతో విజయవంతం చేశాయి. గుంటూరు లాడ్జి సెంటర్ నుంచి.. హిమని సర్కిల్ వరకూ ర్యాలీకి తెలుగుదేశం పిలుపునివ్వగా.. పోలీసులు ఉదయం నుంచే ఉక్కుపాదం మోపారు. ర్యాలీకి వస్తే కేసులు తప్పవంటూ... హెచ్చచరికలు జారీ చేశారు. ఉదయం నుంచే జిల్లా వ్యాప్తంగా.. పార్టీ నాయకుల్ని ఎక్కడికక్కడే గృహనిర్బంధాలు చేశారు.
పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, గృహ నిర్బంధాలు చేసినా.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు లెక్కచేయలేదు. ఒకర్ని నిర్బంధిస్తే పది మందిమి బయటికొస్తాం అన్నట్లు.. కదంతొక్కారు. వీరికి మహిళలు, అమరావతి రైతులు, నగర ప్రజలు, వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు.. జత కలిశారు. అనుకున్న సమయానికే అందరూ వేర్వేరు మార్గాల్లో లాడ్జ్ సెంటర్‌కు చేరుకుని ర్యాలీ ప్రారంభించారు.
ర్యాలీ ప్రారంభమైన క్షణం నుంచే.. పోలీసులు బారికేడ్లు పెట్టి నిలువరించే ప్రయత్నం చేశారు. నిరసన తెలుపుతున్న వారిని బలవంతంగా బస్సుల్లో ఎక్కించి తరలించారు. పోలీసుల ఆంక్షలు, అడ్డంకుల మధ్యే.. భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు లక్ష్యం దిశగా సాగారు. మార్గమధ్యలో అడ్డుగా పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు.
ఒకవైపు పోలీసులు అరెస్టు చేస్తున్నా.. కార్యకర్తలు, మహిళలు, ప్రజలు వెనక్కి తగ్గలేదు. హిమనీ సర్కిల్ వైపు పరుగులు తీశారు. అక్కడికి చేరుకుని..గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. పోలీసుల తీరుపై తెలుగుదేశం, జనసేన, సీపీఐ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. శాంతియుత పోరాటాల్ని పోలీసులతో అణచివేస్తున్న వైకాపా ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని.. ర్యాలీలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు ధ్వజమెత్తారు. తెలుగుదేశం శ్రేణుల తెగువతో కంగుతిన్న పోలీసులు.. గాంధీ విగ్రహం వద్ద జిల్లా పార్టీ నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
"చంద్రబాబు కోసం సంఘీభావం తెలియజేయడానికి కాలేజ్ మానుకొని మరీ స్వచ్ఛందంగా వచ్చాను. నేను స్టూడెంట్ని. మమ్మల్ని కూడా చిత్ర హింసలు పెడుతున్నారు పోలీసులు. ఒక సామాన్యుడిగా నిరసన చేస్తున్నా.. పోలీసులు కొడుతున్నారు. సైకో పాలన మరో ఆరు నెలల్లో అంతం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెబుతున్నా.. మా లాంటి విద్యార్థుల కోసం ఏదైనా చేస్తే చేయాలి లేదంటే మానుకోండి. మా బాబు గారు వచ్చి అభివృద్ధి చేస్తారు. అయిదు వేల రూపాయలు ఇచ్చే వాలంటీర్ జాబులు మాకు వద్దు". - విద్యార్థి.
"ఆడవాళ్లు అని కూడా చూడటం లేదు. జంతువులను వేసుకుని పోయినట్టు వ్యాన్లో ఎక్కిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఆ దేవుడిని కోటుకుంటున్నాము. మా బాబు గారిని జైలులో పెట్టి 29 రోజులు అయింది. ఆధారాలు లేకుండా అన్యాయంగా జైలులో పెట్టారు". - మహిళా కార్యకర్త