Tamil Nadu Panchaloha idols: తమిళనాడులో 37 ఏళ్ల క్రితం చోరీకి గురైన పంచలోహ విగ్రహాలు తిరిగి స్వదేశానికి చేరాయి. తమిళనాడులోని తెన్‌కాసీ జిల్లా అల్వార్‌కురిచీలోని ఓ దేవాలయం నుంచి 11వ శతాబ్దానికి చెందిన రెండు పంచలోహ విగ్రహాలు 1985లో చోరీకి గురయ్యాయి. అప్పట్లోనే దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. అయితే, ఎలాంటి ఆధారాలు లేవని 1986లో కేసును మూసివేశారు. అయితే, న్యూయార్క్ సిటీ మ్యూజియం నుంచి ఈ రెండు విగ్రహాలను తమిళనాడులోని అక్రమ రవాణా నిరోధక విభాగం అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. 11వ శతాబ్దానికి చెందిన ఈ పంచలోహ విగ్రహాల విలువ కోట్ల రూపాయలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రెండు పంచలోహ విగ్రహాలను గంగల నాథర్, అధికార నంది అని వ్యవహరిస్తారని చెప్పారు.
ఇప్పటివరకు 22 విగ్రహాలను వివిధ దేశాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఒక్క ఏడాదే 10 విగ్రహాలను స్వదేశానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. చాలా వరకు విగ్రహాలను అమెరికా, యూకే, ఆస్ట్రేలియాకు అక్రమంగా రవాణా చేసినట్లు తెలిపారు. మరో 40 విగ్రహాలను రికవరీ చేయాల్సి ఉందని వెల్లడించారు. రికవరీ కోసం చాలా సుదీర్ఘమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి వస్తోందని అన్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న విలువైన విగ్రహాలపై సర్వే చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, మధురైలో దొరికిన మరకత శివలింగంకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నిందితుడిని విచారిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: