క్షణికావేశం ఓ నిండు గర్భిణీ ప్రాణాన్ని తీసింది. కోపంలో ఉన్న ఓ వ్యక్తి కనికరం లేకుండా సొంత కుమార్తెను కాల్చి చంపాడు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కరాడికల్ గ్రామానికి చెందిన అరుణాచలం (50) కుమార్తె వెంకటలక్ష్మి(21) కొంతకాలం క్రితం కర్ణాటకకు చెందిన శ్రీనివాసన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. నిండు గర్భిణీగా ఉన్న వెంకటలక్ష్మి తన భర్తతో కలసి ఉగాది రోజున పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న అరుణాచలం తన భార్య మాధవితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న తుపాకీతో ఆమెను కాల్చేందుకు యత్నించాడు. తల్లిదండ్రుల గొడవను ఆపేందుకు అడ్డుగా వెళ్లిన కూతురిపై అరుణాచలం కాల్పులు జరపగా.. అమె ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లి, అక్కడికక్కడే మరణించింది.
ఈ ఉదంతంపై సమాచారం అందుకున్న దెంకానికోట్టయ్ డీఎస్పీ సంగీత.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంకటలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న అరుణాచలంను పట్టుకునేందుకు ఆపరేషన్ను ప్రారంభించారు.
ఇవీ చదవండి: సంతానం కోసం పాముతో పోరాడి.. చివరకు!