మోడలింగ్ అంటే ఓ రంగురంగుల ప్రపంచం. అందులో రాణిస్తే, ఇక జీవితంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది అంత సులభమైన విషయం కూడా కాదు! అంత కష్టమైన రంగాన్ని ఎంచుకున్న ఓ ఆరేళ్ల చిచ్చరపిడుగు.. మోడలింగ్‌లో దుమ్మురేపుతున్నాడు. ర్యాంప్ వాక్‌తో, స్టైలిష్ లుక్స్‌తో ఇప్పటికే ఎన్నో అవార్డులు తన సొంతం చేసుకున్నాడు. అతనే.. తమిళనాడుకు చెందిన రానా శివకుమార్. సోమవారం నుంచి దుబాయ్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ జూనియర్ ఫ్యాషన్ షోలో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్న రానా.. విజయం తనదేనని ధీమాగా ఉన్నాడు.
రానా తల్లిదండ్రులు కోయంబత్తూర్‌లో నివాసముంటున్నారు. రానా తండ్రి శివకుమార్.. ఓ టెక్స్టైల్ వ్యాపారి. తల్లి ఓ సెలూన్‌కు ఓనర్. మూడేళ్ల వయస్సులోనే ర్యాంప్ వాక్ చేసి రానా అదరుగొట్టాడని తల్లి గోమతి చెబుతోంది.
"కోయంబత్తూర్‌లో నేను ఓ సెలూన్ నడుపుతున్నాను. మూడేళ్ల క్రితం.. షాప్‌కు వచ్చిన ఓ ఫ్యాషన్ ఏజెంట్ నా కొడుకుని చూశాడు. రానాది ఫొటోజెనిక్ ఫేస్ అని కితాబిచ్చాడు. వారు నిర్వహిస్తున్న మోడలింగ్ షోకు రానాని పంపించమన్నాడు. ఒకసారి ప్రయత్నిద్దామని తీసుకెళ్లాను. తొలుత కొంత ఆలోచించాము. కానీ ఇప్పుడు రానాని చూసి గర్వపడుతున్నాము."
-గోమతి, రానా తల్లి
అలా.. కోయంబత్తూర్‌లో నిర్వహించిన మోడలింగ్‌లో తొలిసారి పాల్గొన్న రానా.. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఏ పోటీల్లో పాల్గొన్నా.. అవార్డులు అతన్నే వరించేవి. ఇప్పటివరకు 14 అవార్డులు, ఓ మెడల్‌ను దక్కించుకున్నాడు. జాతీయ స్థాయిలో 'రైజింగ్ స్టార్' ట్యాగ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. తన లుక్స్‌తో.. 'రౌడీ మోడల్'గా పేరు సంపాదించుకున్నాడు.
రానా మోడలింగ్ వెనక అతని తండ్రి శివకుమార్‌ది కీలక పాత్ర. ర్యాంప్ వాక్ దగ్గరి నుంచి, మోడలింగ్ వరకు తనకు తెలిసినవన్నీ ఇంట్లోనే రానాకు నేర్పించాడు. దుబాయ్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ జూనియర్ ఫ్యాషన్ షోలో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు రానా తెలిపాడు.
"నా పేరు 'రౌడీ మోడల్' రానా శివకుమార్. నా వయస్సు ఆరేళ్లు. మోడలింగ్, కర్రసాము(సిలంబం) నా అలవాట్లు. మోడలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. దుబాయ్‌లో జరిగే పోటీల్లోనూ అవార్డ్ గెలుస్తాను."
-రానా శివకుమార్
రానా విజయాల పట్ల అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలుడికి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం చదువు, మోడలింగ్‌లపై శ్రద్ధ పెట్టినట్లు వెల్లడించారు. అయితే భవిష్యత్తులో తాను నేవీలో పనిచేయాలని అనుకుంటున్నట్టు తెలిపాడు రానా శివకుమార్.