ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్.. భారత్‌కూ విస్తరించింది. తొలికేసు కేరళలో నమోదయ్యింది. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్యశాఖ అధికారికంగా ధ్రువీకరించింది. తొలుత అనుమానిత కేసుగా గుర్తించిన అధికారులు, వైద్యపరీక్షల అనంతరం మంకీపాక్స్‌గా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) మార్గదర్శకాల మేరకు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
ఇటీవల యూఏఈ నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తి మంకీపాక్స్ తరహా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. వైరస్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం అతడి నుంచి నమూనాలను సేకరించి పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కి పంపినట్లు తెలిపారు. తాజాగా వచ్చిన ఫలితాల్లో అది మంకీపాక్స్‌గా నిర్ధారణ అయినట్లు ప్రకటించారు. సదరు వ్యక్తి యూఏఈలో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆయనతో సన్నిహితంగా ఉన్న ప్రైమరీ కాంటాక్టులను గుర్తించామన్నారు. బాధితుడి తల్లి దండ్రులు, టాక్సీ, ఆటో డ్రైవర్లతోపాటు మరో 11 మంది తోటి ప్రయాణికులను ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించామని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
కేరళకు నిపుణుల బృందం: కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వివిధ రంగాల నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి బృందాన్ని కేరళకు పంపించింది. అవసరమైన ప్రజారోగ్య చర్యలు చేపట్టేందుకు ఈ బృందం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పనిచేస్తుంది. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ), దిల్లీలోని డాక్టర్ ఆర్‌ఎంఎల్ ఆసుపత్రి, కేరళలోని వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రాంతీయ కార్యాలయాలకు చెందిన నిపుణులతో పాటు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ బృందంలో ఉన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఈ బృందం తగు చర్యలకు సిఫార్సు చేస్తుంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అందించిన సమాచారం ప్రకారం మంకీపాక్స్.. జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్ కారణంగా వచ్చే వ్యాధి. అంత తీవ్రంగా లేనప్పటికీ.. గతంలో కనిపించిన మశూచి వ్యాధి (స్మాల్‌పాక్స్)ని పోలిన లక్షణాలే మంకీపాక్స్‌లోనూ కనిపిస్తాయని డబ్ల్యూహెచ్‌వో గతంలో పేర్కొంది. తగినస్థాయిలో వ్యాక్సినేషన్ అనంతరం స్మాల్‌పాక్స్‌ను 1980లో నిర్మూలించగలిగారు.
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం: మంకీపాక్స్‌పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను గురువారం కేంద్రం అప్రమత్తం చేసింది. దేశంలో ఈ వ్యాధి వ్యాప్తిచెందకుండా చేపట్టే చర్యల్లో భాగంగా అన్ని అనుమానిత కేసులనూ పరీక్షించాలని స్పష్టం చేసింది. నిర్ధారణ అయిన లేదా అనుమానిత కేసులకు సంబంధించి అవసరమైన చికిత్సలు అందించేందుకు ఆసుపత్రులను గుర్తించాలని తగినంత మానవ వనరులను, సామాగ్రిని కూడా సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 22 వరకు 50 దేశాల్లో 3,413 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ కాగా, ఒకరు మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించిందని లేఖలో పేర్కొన్నారు. మంకీపాక్స్‌కు సంబంధించి కేంద్ర మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేశారు.
మంకీపాక్స్ గురించి: మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తుంటుంది. ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం, శారీరకంగా కలవడం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమనని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.
ఇవే లక్షణాలు...
జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్మాల్‌పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. కేవలం 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
వారిలోనే ఎక్కువ!
ఇదిలాఉంటే, గత కొంతకాలంగా వేగంగా విస్తరిస్తోన్న మంకీపాక్స్ ఇప్పటికే 59 దేశాలకు పాకింది. 6వేల మందిలో నిర్ధారణ కాగా.. ముగ్గురు మృత్యువాతపడ్డారు. మంకీపాక్స్ కేసులు ఎక్కువగా యూరప్, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, ముఖ్యంగా స్వలింగ సంపర్కుల్లోనే ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి:
'నియంత', 'జుమ్లాజీవి', 'సిగ్గు చేటు'... పార్లమెంట్లో ఈ పదాలు బంద్!
స్నేహితులతో కలిసి భార్యపై గ్యాంగ్‌రేప్.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మైనర్‌పై..