సమాజంలో వేగంగా మారుతున్న అవసరాలు, డిజిటలైజేషన్, కొవిడ్‌లాంటి మహమ్మారి సృష్టిస్తున్న పరిస్థితులను తట్టుకొని న్యాయవ్యవస్థ వేగంగా సేవలందించాలంటే.. మౌలిక వసతులను మెరుగుపర్చాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఆధునిక వసతులతో కోర్టు సముదాయాలు నిర్మించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ''మన న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న మౌలిక వసతుల కొరతకు పరిష్కారం చూపడానికి నేషనల్ జ్యుడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఆధునిక వసతులతో కూడిన సమగ్ర కోర్టు సముదాయాలు నిర్మించాలి. ప్రస్తుత మహమ్మారి నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా అన్ని కోర్టుల్లోనూ వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది'' అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులు, కిందిస్థాయి కోర్టుల పనితీరును జస్టిస్ రమణ రెండు రోజులపాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కరోనా నేపథ్యంలో అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి నేరుగా వారినే అడిగి తెలుసుకున్నారు. సంక్షోభ సమయంలో న్యాయవ్యవస్థలో విశ్వాసం నింపడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయాధికారులు, ఇతర సిబ్బందికి ఈ సందర్భంగా నివాళులర్పించారు. న్యాయవ్యవస్థ పనితీరుపై మహమ్మారి ప్రభావం, ఆటంకం లేకుండా సాగడానికి పరిపాలనా విభాగం తీసుకున్న చర్యలు, అనుసరించిన వినూత్న విధానాలు, భాగస్వాములు, వారి కుటుంబసభ్యులందరికీ వ్యాక్సినేషన్ కోసం తీసుకున్న చర్యల గురించి చర్చించారు. జ్యుడిషియల్ అకాడమీల పనితీరుపై క్లుప్తంగా చర్చించారు. ప్రస్తుతం అకాడమీల్లో శిక్షణ పొందుతున్న అధికారులకు వీడియో కాన్ఫరెన్సింగ్ విధానం గురించి పూర్తిస్థాయిలో శిక్షణ ఇప్పించాలని సూచించారు. ప్రస్తుత మహమ్మారి సమయంలో కోర్టులు నడవక ఆదాయం కోల్పోయిన జూనియర్ న్యాయవాదులను ఆదుకోడానికి చర్యలు తీసుకోవాలని జస్టిస్ రమణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సూచించారు.
ప్రాంగణం విస్తరించాలని కోరాం: ఏపీ హైకోర్టు సీజే
బాంబే, పంజాబ్-హరియాణా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మౌలిక వసతుల సమస్యలను జస్టిస్ రమణ దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు జస్టిస్ రమణ సానుకూలంగా స్పందిస్తూ.. ‘‘అన్ని భాగస్వామ్య పక్షాల నుంచి సలహాలు, సూచనలు వచ్చిన తర్వాత మౌలిక వసతుల కోసం జాతీయస్థాయి ప్రణాళిక రూపొందించి ముందుకు తీసుకెళదాం. మౌలిక వసతులు లేని కోర్టుల నుంచి ఫలితాలు ఆశించడం అన్యాయం అవుతుంది. ముఖ్యంగా పెండింగ్ కేసుల పరిష్కారంలో కిందిస్థాయి కోర్టుల నుంచి అద్భుతాలు ఆశించడం తగదు. రోజువారీ సవాళ్లను ఎదుర్కోడానికి అవసరమైన వ్యవస్థ ఉన్నప్పుడే న్యాయ పరిష్కారాలు మెరుగుపడతాయి’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘మా వద్ద ప్రస్తుత హైకోర్టులో అన్ని కోర్టులు సమావేశం కావటానికి వసతి చాలటం లేదు. అందువల్ల ఇప్పుడున్న కోర్టు ప్రాంగణాన్ని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నాం’’ అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి వివరించారు.
ఖాళీల భర్తీలో బడుగులు, మహిళలకు ప్రాధాన్యం
హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఇటీవలే అందరు ప్రధాన న్యాయమూర్తులకు లేఖ రాసిన జస్టిస్ రమణ ఆ విషయాన్ని ఈ సమావేశంలో మరోసారి ప్రస్తావించారు. న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు పంపేటప్పుడు.. బడుగు బలహీనవర్గాలు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కనెక్టివిటీ, వ్యాక్సిన్ సరఫరా, మౌలిక వసతుల పరంగా ఎదురవుతున్న అత్యవసర సమస్యలను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని జస్టిస్ రమణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు భరోసా ఇచ్చారు. అలాగే కోర్టు సిబ్బందిని ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తించి వేగంగా వ్యాక్సిన్ అందించే విషయాన్ని కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి సమావేశాలు మున్ముందు తరచూ నిర్వహించి కోర్టుల నిర్వహణలో ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
నెట్‌వర్క్ సమస్యకు మొబైల్ పరిష్కారం
గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యను తాత్కాలికంగానైనా పరిష్కరించాలన్న ఉద్దేశంతో మొబైల్ వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి సీజేఐ దృష్టికి తెచ్చారు. డిజిటల్ అంతరాలు (డిజిటల్ డివైడ్) న్యాయవ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతున్నాయన్న భావన సమావేశంలో వ్యక్తమైన సందర్భంగా ఆమె ఈ విషయం తెలిపారు.
- తెలంగాణ హైకోర్టు సీజేజస్టిస్ హిమా కోహ్లి
ఇవీ చదవండి: 'వీడ్కోలు పలకడం అనేది కష్టమైన పని'