దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్(vaccination in india) కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేయలేమని సుప్రీంకోర్టు(supreme court news) శుక్రవారం స్పష్టం చేసింది. ప్రజలకు టీకాలు వేయకుంటే.. చెల్లించాల్సిన మూల్యాన్ని దేశం భరించలేదని పేర్కొంది. ఇప్పటికే కోట్ల మంది ప్రజలు టీకాలు తీసుకున్నారని.. అలాగే ప్రపంచమంతటా వ్యాక్సిన్ వేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO on vaccination) కూడా ఆమోదం తెలిపిందని పేర్కొంది. ప్రజలు టీకా తీసుకోవడాన్ని స్వచ్ఛందం చేయడం తదితర అంశాలపై కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ అజయ్ కుమార్ గుప్త, మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్ ప్రతిని సొలిసిటర్ జనరల్‌కు అందజేయాలని ఆదేశిస్తూ.. దీనిపై ఆయన సమాధానం అడిగింది.
"ఇమ్యునైజేషన్ తర్వాత ఎలాంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తినా పర్యవేక్షించేందుకు మనకు ఓ వ్యవస్థ ఉంది.. మార్గదర్శకాలున్నాయి. వ్యతిరేకులు ఎప్పుడూ ఉంటారు.. కానీ విధానం వారు సూచించినట్లు ఉండదు. మనం దేశ హితాన్ని చూడాలి. గతంలో ఎన్నడూ చూడని విధంగా యావత్ ప్రపంచం మహమ్మారి బారిన పడింది. ఈ దశలో ప్రజలు టీకాలు తీసుకోవడం అత్యంత జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశం" అని ధర్మాసనం స్పష్టం చేసింది. టీకాలతో పలు మరణాలు సంభవించాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించగా.. "ఆ మరణాలు కేవలం వ్యాక్సిన్ల(corona vaccine death) వల్లే అని చెప్పలేం. అనేక ఇతరత్రా కారణాలూ ఉండొచ్చు" అని ధర్మాసనం పేర్కొంది. అనంతరం విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
కొవిడ్‌తో తీవ్రంగా దెబ్బతిన్న కుటుంబాల పునరావాసానికి ఓ జాతీయ ప్రణాళికను రూపొందించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, అన్ని రాష్ట్రాలకూ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం నోటీసులు ఇచ్చింది. ఈమేరకు సుధీర్ కత్‌పాలియా అనే వ్యక్తి వ్యాజ్యం దాఖలు చేశారు. కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల ఫీజులను కూడా రద్దు చేయాలని వ్యాజ్యంలో కోరారు.
ఇదీ చూడండి: ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పోరుబాట- భారీ ర్యాలీకి ఏర్పాట్లు